చిరుకి యువరాజు క్లాస్ పీకారా?

Update: 2015-09-24 16:23 GMT
యావత్తు తెలుగు ప్రజల అభిమానాన్ని పొందిన చిరంజీవి ప్రస్తుత పరిస్థితి ఇబ్బందికరంగా ఉందా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. పవర్ లో ఉన్నప్పుడు తప్పించి.. పవర్ మిస్ అయితే.. ఏ మాత్రం తట్టుకోలేని చిరుకు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీని పెట్టాలన్న ఆలోచన మదిలో బలంగా నాటుకున్న నాటి నుంచే అధికారం అన్నది చాలా చిన్న వ్యవహారమని.. తాను పార్టీ పెడితే.. తర్వాతి సీఎం తానేనన్న భావన ఆయనలో ఎక్కువని ఆయనకు సన్నిహితంగా వ్యవహరించిన పలువురు చెబుతుంటారు.

అలాంటి వ్యక్తిత్వమే తర్వాతి కాలంలో ఆయన కొంప ముంచింది. పార్టీ పెట్టినంతనే పవర్ చేతకి వచ్చేస్తుందన్న అంచనాకు భిన్నంగా ఎన్నికల ఫలితాల్ని చూసి డంగైపోవటం.. ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు.. ఒంటరిగా పార్టీని నడిపించే కన్నా.. కాంగ్రెస్ లాంటి పార్టీ అండతో మరింత పవర్ ఫుల్ గా మారొచ్చని ఆయన భావించారు. క్రౌడ్ ఫుల్లింగ్ తో పాటు.. మాస్ ను ఆకర్షించే గుణం ఉన్న నేపథ్యలో చిరు కారణంగా కాంగ్రెస్ కు ప్లస్సే తప్పించి మైనస్ కాదన్నట్లు భావించి.. పార్టీ ఎమ్మెల్యేల్ని.. నేతల్ని టోకుగా ఇచ్చేశారు.

ఇందుకు కాను కొన్ని మంత్రి పదవులు ఇప్పించేసుకొని పార్టీ విలీనాన్ని పూర్తి చేసిన చిరు.. రాష్ట్ర విభజన సందర్భంగానూ.. అనంతరం పెద్దగా పట్టించుకున్నది లేదు.  కేంద్రమంత్రి పదవి గురించిన ఆలోచన తప్పించి.. రాజకీయాల్లోకి రాకముందు తెలుగు ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టేయటం జరిగిందని చెప్పొచ్చు. ఈ కారణం చేతనే కావొచ్చు విభజన విషయంలో ఒకదశలో తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఆ తర్వాత నలుగురితో పాటు అన్నట్లుగా వ్యవహరించారే కానీ.. ఏపీ ప్రజల సంక్షేమం కోసం పెద్దగా ప్రయత్నించలేదన్న విమర్శ ఉంది.

ఇక.. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితితో పాటు.. ఏపీలో ఆ పార్టీ పునాదులు మొత్తం కదిలిపోవటంతో ఆయన మరింత డీలా పడినట్లు చెబుతారు. ఎంత ఉత్సాహంగా పని చేసినా.. పాతాళంలోకి పడిపోయిన పార్టీని పైకి లేపటం కష్టంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే.. రాజకీయాల గురించి కాస్త ఆసక్తి తగ్గించి.. తన 150 సినిమా మీద దృష్టి పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఆయన బీజేపీలో చేరనున్నట్లుగా వార్తలు రావటం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వినిపిస్తున్న పలు వాదనల ప్రకారం.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. చిరును పిలిచి క్లాస్ పీకారని.. ఆయన తీరును మార్చుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చామని.. పార్టీ పవర్ లో లేప్పుడు ఒళ్లు వంచాలన్నది ఆయన సూచనగా చెబుతున్నారు.

అయితే.. రాహుల్ మాటలకు చిరు నొచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన బీజేపీలోకి చేరనున్నట్లగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థిల్లో కాంగ్రెస్ లో కొనసాగి తిట్లు తినే కన్నా.. బీజేపీలో చేరటం ద్వారా ఏదైనా పదవిని చేపట్టొచ్చే వీలుందని చెబుతున్నారు. తమ్ముడి మాటతో కమలంతో కలిసిపోయి కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ సే వీలుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే చిరంజీవిని రాహుల్ క్లాస్ పీకటం ఒకటైతే.. పవర్ లేని పార్టీలో అనామకంగా ఎంతకాలం పడి ఉండటం అన్న ఆలోచనకు సమాధానంగానే ఆయన బీజేపీ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన పరిణామాలన్నీ కాలమే చక్కటి జవాబులిచ్చే వీలుంది.
Tags:    

Similar News