విదేశాలకు వెళ్లిన యువరాజు యాడున్నారు?

Update: 2015-09-29 04:29 GMT
తరచూ విదేశాలకు వెళ్లి.. స్వదేశంలో తక్కువ.. విదేశాల్లో ఎక్కువగా ఉంటారంటూ ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. పార్టీ నేతలు యువరాజుగా కొలిచే రాహుల్ గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంటారు. సూటూ.. బూటు ప్రధాని అంటూ ఎద్దేవా చేసే రాహుల్ మాటలకు చేతలకు అస్సలు పొంతనే ఉండదు.

ప్రధాని మోడీ తాజా విదేశీ పర్యటన సమయంలోనే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా ఫారిన్ ట్రిఫ్ వెళ్లారు. ప్రధాని విదేశీ పర్యటన సందర్భంగా ఆయన ఎంతగా పని చేస్తున్నది.. ఎవరెవరిని కలుస్తున్నది.. దేశానికి ప్రయోజనం కలిగించేలా ఆయన ఏం మాట్లాడుతున్నది చూస్తున్నాం. అదే సమయంలో.. విపక్షానికి చెందిన యువరాజు రాహుల్ మాత్రం అసలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయంపై స్పష్టతే లేని పరిస్థితి.

అసలు ఏ దేశానికి వెళ్లారన్న విషయం మీదనే స్పష్టత లేదు. ఒకసారి బ్రిటన్ అని.. మరోసారి అమెరికాకు వెళ్లినట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నప్పటికీ.. అసలు ఏ దేశానికి ఆయన వెళ్లారో చెప్పే నాథుడే లేడు. రాహుల్ లాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు.. ఆయనేం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఆయన ఫారిన్ టూర్ తో దేశానికి ఎంత ప్రయోజనం లాంటి అంశాలకు సంబంధించి కనీసం ఒక్క వార్త అయినా రావాల్సి ఉంది. కానీ.. అదేమీ లేకుండా ఉండటం చూస్తే.. రాహుల్ విదేశీ పర్యటన రహస్య పర్యటనా అన్న సందేహం కలగటం ఖాయం. అంతేకాదు.. ఆయన వెళ్లింది అమెరికానా? బ్రిటనా? అన్న డౌట్ తో పాటు.. ఈ రెండు దేశాలు కాకుండా మరే దేశమైనా వెళ్లారా? అన్న భావన కలగటం ఖాయం.

రాహుల్ విదేశీ పర్యటనపై ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడటం.. విమర్శలు చేయటంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేసింది. ఏదో భేటీలో పాల్గొన్నట్లుగా  ఆ ఫోటో ఉంది. అదే నిజమైతే.. అయ్యగారు ఏ భేటీలో పాల్గొన్నారు..? భారత్ తరఫున ఎలాంటి వాణిని వినిపించారు లాంటివి కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తే సగటు భారతీయులు ఎంతో కొంత సంతోషపడతాడుకదా? అలాంటి అల్ప సంతోషాలు దేశ ప్రజలకు ఇవ్వటం యువరాజుకు ఇష్టం లేదా..?
Tags:    

Similar News