దీపావళి థమాకా కూడా ఉంటుందా?

Update: 2015-09-29 12:27 GMT
పావలా అడిగితే పది పైసలు రాల్చేందుకు కూడా ఇష్టపడరన్న విమర్శలు ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై తరచూ చేస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయన ప్రకటించిన ద్రవ్య పరపతి.. విధాన సమీక్షకు మార్కెట్ వర్గాల నుంచి విపరీతమైన సానుకూలత వ్యక్తం కావటం తెలిసిందే.

కీలక వడ్డీరేట్లను ప్రభావితం చేసే రెపో రేటును 50 బేసిక్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వడ్డీరేట్లు అరశాతం తగ్గనున్నాయి. ఈ ప్రకటనకు సెన్సెక్స్ తో పాటు.. నిఫ్టీ కూడా భారీగానే లాభపడింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే నాటికి మార్కెట్ విలువ రూ.33వేల కోట్ల మేర సంపద పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్ బీఐ గవర్నర్ తాజా ప్రకటనతో కీలకమైన గృహరుణాల ఈఎంఏల మీద ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గృహ రుణాల మీద వడ్డీరేటు తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రఘురాం రాజన్ ప్రకటన పట్ల మార్కెట్ వర్గాలు తీవ్ర ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఊహించని రీతిలో వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంపై రఘురాం రాజన్ పై ప్రశంసలతో పాటు.. ఆయన్ను క్రిస్టమస్  తాత (శాంతా క్లాజ్) గా కొందరు పోల్చేయటం గమనార్హం.
Read more!

దీనిపై స్పందించిన ఆయన రఘురాం రాజన్ మాట్లాడుతూ.. తనను ఎలా పిలుస్తారన్నది తనకు తెలీదని.. తనను ఇతర పేర్లతో పిలిపించుకునే ఉద్దేశ్యం లేదన్న ఆయన.. ‘‘నా పేరు రఘురాం రాజన్. నేను చేయగలిగింది చేస్తా. మీరు నన్ను శాంతా క్లాజ్ అని పిలుస్తారా? హక్ అని పిలుస్తారా? అన్నది నాకు తెలీదు. నేనేం చేయగలనో అదే చేస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు.

మార్కెట్ వర్గాలు తాజా తగ్గింపును దివాలీ బోనస్ గా అభివర్ణించటంపై ఆయన స్పందిస్తూ.. దీపావళి లోపు పెట్టుబడిదారులకు ఆనందం కలిగించే నిర్ణయాలు మరికొన్న తీసుకునే అవకాశం ఉందన్నట్లుగా ఆర్ బీఐ గవర్నర్ ఇవ్వటం మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News