టీ ఎన్నికల వేళ.. కోట్ల కరాళ నృత్యం..

Update: 2018-11-08 12:04 GMT
తెలంగాణ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 35 ఏళ్లుగా దాయాదులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికల వేళనే పాత పగలు మాని ఒక్కటయ్యాయి. జీవన్మరణ సమస్యగా ఎన్నికలను భావిస్తున్న కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కి వేసి మహాకూటమికి తెరతీసింది. విజయమే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల బరిలో నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయి. అదీ అలా ఇలా కాదు.. ధన ప్రవాహం చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా..

తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ రెండు నెలల సమయమిస్తూ నోటిఫికేషన్ వేసింది. ఈ రెండు నెలల్లో ఇప్పటికే నెలరోజులు గడిచిపోయింది. ఈ నెల రోజుల్లోనే దాదాపు 62 కోట్ల లెక్కా పత్రం లేని డబ్బును పోలీసులు పట్టుకున్నారు. నిన్న ఒక్కరోజులోనే హైదరాబాద్ లో ఏడున్నర కోట్ల హవాలా డబ్బు పట్టుకోవడం కలకలం రేపింది. రాజకీయ పార్టీలకు చేరవేసేందుకే ఈ హవాలా డబ్బును సిద్ధం చేసినట్టు సమాచారం.

2014 మేలో జరిగిన అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో పోలీసులు 74 కోట్లను పట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకు నెల ముందుగానే తెలంగాణలో 62 కోట్లు బయటపడడం తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. తెలంగాణలో పోలింగ్ జరిగే వచ్చే నెల 7వరకు ఇంకా ఎన్ని కోట్లు బయటపడుతాయో చూడాలి మరి..
Tags:    

Similar News