ఆ తెలుగు తమ్ముడు పరుగులు పెట్టారు

Update: 2016-09-28 09:36 GMT
నిజమే.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే పరుగులు పెట్టారు. ఆయనే కాదు ఆయన వెంట ఉన్న పరివారం సైతం  తమ పిక్కలకున్న బలాన్ని మొత్తాన్ని ప్రదర్శించారు. ఎందుకలా అంటే.. పరిస్థితి అలాంటిది. ఇంతకీ.. ఎమ్మెల్యేని.. ఆయన అనుచరగణాన్ని.. ఆయన చుట్టూ ఉన్న వారిని అంతలా హడలెత్తించింది మరెవరో కాదు.. కందిరీగలు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటన ఇప్పుడు విశాఖ జిల్లాలో పలువురి నోట నానుతోంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నష్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు.. బాధితుల్ని పరామర్శించేందుకు పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో విశాఖ జిల్లా కశింకోట మండలంలోని నర్సాపురం జిల్లాలోని శారదానది మీద ఉన్న ఆనకట్ట వద్ద వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమాచారాన్ని అందుకున్న అధికారపక్ష ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారంటే.. ఆయన వెంటనే ఉండే అధికారగణం ఆయన్ను ఫాలో అయ్యింది.

అధికారులు.. అనుచరగణం.. స్థానికులతో కలిసి ఆనకట్ట వద్ద వరద ఉధృతిని పరిశీలిస్తున్న వేళ.. ఎవరో పొదల్లో ఉన్న కందిరీగల తుట్టెను కదిపారు. దీంతో.. ఒక్కసారిగా రెచ్చిపోయిన కందిరీగలు చెలరేగిపోయాయి. కనిపించినోళ్లను కనిపించినట్లుగా దాడి చేసే ప్రయత్నాన్ని షురూ చేశాయి. దీంతో.. బతుకు జీవుడా అంటూఎమ్మెల్యే సహా.. అధికారులు.. అనుచరగణం.. స్థానికులు పరుగులు తీశారు. రెప్పపాటులో స్పందించి.. పరుగులు తీసినా.. కందిరీగల స్పీడ్ కు చాలామంది గాయాల పాలు కావాల్సి వచ్చింది. కందిరీగల ధాటికి గాయాలకు గురైన వారికి చికిత్స జరిపించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News