అస్పష్టవాసి.. లా కనిపిస్తున్నాడు

Update: 2017-12-10 11:23 GMT
మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించి హడావుడి చేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పొలిటికల్ పర్ఫార్మెన్సును, ఆయన మాటల్లో లోతులను - మెచ్యూరిటీ లెవల్స్‌ ను రాజకీయ విశ్లేషకులు రివ్యూ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ఱ్టంలో ప్రభావవంతంగా ఉన్న పార్టీల నేతలు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడుతున్న సమయంలో తటస్థ వర్గాలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కేవలం పవన్ అవగాహన స్థాయి విశ్లేషించుకుని ఆయన పట్ల ఒక అవగాహనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఇంతవరకు తమకు పవన్‌పై ఉన్న ఇమేజ్ - అంచనాలు తగ్గాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఆయన గందరగోళంగా మాట్లాడడం... సమస్యకు కారణం ఒకరైతే ఇంకొకరిపై నిందలేయడం - సరైన స్టాండ్ లేకుండా మాట్లాడడం వంటివి ఉదహరిస్తున్నారు.
    
ముఖ్యంగా విజయవాడలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఆయన జగన్ ప్రస్తావన తెచ్చారు. గత ఎన్నికల్లో జగన్ కు తానెందుకు మద్దతివ్వలేదన్న విషయం చెప్పుకొచ్చారు. జ‌గ‌న్‌ పై సీబీఐ కేసులు - అభియోగాలు లేక‌పోయి ఉంటే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవాడినేమో - అవినీతి ఆరోప‌ణ‌లు..సీబీఐ కేసులు ఉన్న వ్య‌క్తికి మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పుచేసిన‌వాడిన‌వుతాను కాబట్టే బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చానని చెప్పుకొచ్చారు. కానీ, అదే మీటింగులో ఆయన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇబ్బంది పడ్డారని - అయినప్పటికీ ఆయన సీఎం కుర్చీలో ఉంటే ఆయనకు ఉన్న అనుభవంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్న భావనతోనే ఆ అంశంపై తాను మౌనంగా ఉన్నానని చెప్పారు. ఇది అందరినీ గందరగోళంలో పడేసిందని విశ్లేషకులు అంటున్నారు. కేసులున్నాయని జగన్ కు మద్దతివ్వలేదని చెప్పిన పవన్ చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయం గురించి లైట్ గా తీసుకోవడం తప్పుడు సంకేతాలు పంపిందని అంటున్నారు.
    
అలాగే ఒంగోలులో మాట్లాడుతున్నప్పుడు తాను ఒంటరిగా బయల్దేరానని, మార్పు ఎప్పుడైనా సరే ఒక్కడితోనే మొదలవుతుందని చెబుతూ తాను వన్ మ్యాన్ ఆర్మీ  అన్న రేంజిలో మాట్లాడారు. కానీ... కొద్దిసేపట్లోనే ప్రత్యేక హోదా తన ఒక్కడి వల్ల రాదని, అందరూ కలిసి సాధించుకోవాలని చెప్పారు. ఇవన్నీ పవన్ కు స్పష్టత లేదన్న విషయాన్ని చెబుతున్నాయని అంటున్నారు.
    
అంతకుముందు కూడా కాబోయే సీఎం పవన్ అంటూ జనం నినదిస్తుంటే నాకు అంత సీను లేదని చెప్పేశాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. అభిమానులు అంత ఊపు తెస్తుంటే పవనే స్వయంగా జావగారిపోతున్నాడని.. చూస్తుంటే, పవన్ ను గెలిపించినా తన అన్న చిరంజీవినో, లేదంటే చంద్రబాబునో సీఎం పీఠంపై కూర్చోమని చెప్పేలా ఉన్నాడని ఆయన విమర్శకులు, విశ్లేషకులు చెప్తున్నారు.
Tags:    

Similar News