ఆ పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెప్పండయ్యా

Update: 2018-04-22 06:28 GMT
ప్రజారాజ్యం పార్టీలో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ఉండేవాడు. ఆవేశంగా వ్యాఖ్యలు చేసేవాడు. కానీ సొంతంగా జనసేన పార్టీ పెట్టాక పవన్ లో చాలా మార్పు కనిపించింది. ఆరంభం నుంచి చాలా సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాడు. చాలా మెతకగా తయారయ్యాడు. రాజకీయ ప్రత్యర్థులు.. తన వ్యతిరేకుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్య పవన్ స్వరం మారింది. తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా మీద కూడా పవన్ యుద్ధం ప్రకటించాడు. పవన్ ఇలా దూకుడుగా వ్యవహరిస్తుండటం అభిమానులకు ఆనందాన్నిస్తోంది. కానీ సరైన పరిశీలన.. పరిశోధన లేకుండా పవన్ ఏది పడితే అది మాట్లాడేస్తుండటమే చిత్రంగా తోస్తోంది.

పవన్ టీవీ-9 సీఈఓ రవిప్రకాష్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ముందు వీళ్ల బాగోతాలన్నీ బయట పెట్టేయబోతున్నట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చాడు. తీరా పవన్ బయట పెడుతున్న విషయాలు చూసి అందరూ నివ్వెర పోతున్నారు. ఎప్పుడో ఐదేళ్ల కిందట రవిప్రకాష్ మీద ఆ ఛానెల్ మాజీ ఉద్యోగి బూటు విసరడం.. ఆ తర్వాత అతడే రవిప్రకాష్ కాళ్ల మీద పడి క్షమాపణ కోరడం తెలిసిందే. ఆ వీడియోను ఐదేళ్ల కిందటే కొన్ని కోట్ల మంది చూశారు. ఇప్పుడు పవన్ తానేదో ఆ వీడియోను సేకరించి తెచ్చినట్లుగా దాన్ని చూపించి రవిప్రకాష్ కు ప్రశ్నలు సంధిస్తున్నాడు. దానికి సంబంధించిన వార్తలు కూడా షేర్ చేస్తున్నాడు. పవన్ ఏదో కొత్తగా ఏమైనా చెబుతాడేమో అని ఉత్కంఠగా ఎదురు చూసిన జనాలకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. పవన్ చేస్తున్న హడావుడి అతిగా అనిపించి పెదవి విరుస్తున్నారు. ఈ రోజు రాధాకృష్ణ మీద పవన్ దాడి కూడా ఇదే తరహాలో ఉంది. పవన్ చేస్తున్న ట్వీట్లు చూస్తే సీరియస్ నెస్ ఏమీ కనిపించడం లేదు. విషయాన్ని అతనే బాగా డైల్యూట్ చేసేస్తున్నట్లుగా ఉంది. రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా పవన్ కు ఈ వ్యవహారాల్లో సలహాలిస్తున్నదెవరో కానీ.. అతడిని బాగా తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉంది. ఈ విషయంలో పవన్ కాస్త విజ్ఞులు ఎవరైనా హెచ్చరిస్తే మంచిది.


Tags:    

Similar News