ఆ మాజీ దేశాధ్యక్షుడికి ఏడాది జైలు

Update: 2021-10-01 03:51 GMT
ప్రపంచ ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా.. ఆధునిక దేశాలకు.. సంపన్న దేశాలకు రూపంగా నిలిచే ఫ్రాన్స్ లాంటి దేశానికి దేశాధ్యక్షుడిగా వ్యవహరించిన నికోలస్ సర్కోజీకి తాజాగా అక్కడి న్యాయస్థానం ఏడాది పాటు జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పిన వైనం సంచలనంగా మారింది.

ఇంతకూ ఆయన చేసిన అంత భారీ నేరం.. ద్రోహం ఏమిటో తెలిస్తే అవాక్కు కాకుండా ఉండలేరు. ఎన్నికల ప్రచారానికి ఆయన చేసిన ఖర్చు పరిమితికి మించిన రెండింతలు కావటమే. దీంతో.. ఆయనకు జైలు తప్పలేదు.

2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. 2012లో జరిగిన ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటం కోసం అనుమతించిన దాని కంటే అధికంగా ఖర్చు పెట్టినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆయన చేయాల్సిన ఖర్చు 27.5 మిలియన్ డాలర్లు మాత్రమే. అందుకు భిన్నంగా ఆయన రెండు రెట్లు అధికంగా నిధులు ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ఆయనపై న్యాయ విచారణ మొదలైంది. దీనికి తోడు 2012లో ఆయనపై ఫ్రాంకోయిస్ హోలాండే విజయం సాధించారు. ఆయనపై చేసిన ఆరోపణలు నిజమని న్యాయస్థానం తేల్చటంతో.. అప్పటివరకు నిందితుడిగా ఉన్న మాజీ దేశాధ్యక్షుడు దోషిగా మారారు. దీంతో ఆయన చెరగని పాడు ముద్రను మీద వేసుకున్నట్లైంది. తాను గడపాల్సిన ఏడాది జైలు జీవితాన్ని.. ఎలక్ట్రానిక్ మానటరింగ్ బ్రాసెలెట్ ధరించి హౌస్ అరెస్టులో ఉంటానని కోరటం.. గతంలో ఆయన దేశాధ్యక్షుడిగా పని చేసి ఉండటంతో.. న్యాయస్థానం అందుకు ఓకే చెప్పింది. నిధుల ఖర్చు పరిమితికి మించి ఖర్చు చేయటం ఎంత పెద్ద తప్పన్న విషయం ఫ్రాన్స్ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి.
Tags:    

Similar News