అమెరికా వీసా కష్టాలు: 9 ఏళ్లలో 4 సార్లు తిరస్కరణ.. ఒక భారతీయ కుటుంబం ఆవేదన!
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనేది చాలా మంది భారతీయుల కల. అయితే ఆ కల నెరవేరాలంటే పాస్‌పోర్ట్‌పై 'యూఎస్ వీసా' ముద్ర పడటం అంత తేలికైన విషయం కాదని మరోసారి రుజువైంది.;
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనేది చాలా మంది భారతీయుల కల. అయితే ఆ కల నెరవేరాలంటే పాస్‌పోర్ట్‌పై 'యూఎస్ వీసా' ముద్ర పడటం అంత తేలికైన విషయం కాదని మరోసారి రుజువైంది. తాజాగా ఒక భారతీయ కుటుంబానికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా రెడిట్ లో పెద్ద చర్చకు దారి తీసింది. తొమ్మిదేళ్ల వ్యవధిలో ఏకంగా నాలుగు సార్లు ప్రయత్నించినా అమెరికా విజిటర్ వీసా (బీ1/బీ2) లభించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
దశాబ్ద కాలంగా సాగుతున్న వీసా పోరాటం
సదరు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. వారి వీసా ప్రయత్నాలు 2017లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఒక కుటుంబ వివాహానికి హాజరుకావడానికి రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా రెండుసార్లూ తిరస్కరణకు గురయ్యారు. అనంతరం 2018లో తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్లాలని భావించి మూడోసారి దరఖాస్తు చేశారు. కొడుకు చదువు పూర్తి చేసుకుంటున్న ఆ మధుర క్షణాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులకు అప్పుడు కూడా నిరాశే ఎదురైంది.
వరుసగా మూడుసార్లు తిరస్కరణ ఎదురవడంతో ఆ కుటుంబం తమ ప్రొఫైల్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లలో కెనడా, సింగపూర్, మలేషియా వంటి దేశాలను సందర్శించి బలమైన 'ట్రావెల్ హిస్టరీ' ని నిర్మించుకున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించే పత్రాలు స్వదేశంలో తమకున్న బలమైన బంధాలను చూపే ఆధారాలను సిద్ధం చేసుకుని, 2026లో నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ విధి వెక్కిరించినట్లు ఈసారి కూడా వారికి వీసా లభించలేదు.
సెక్షన్ 214(బీ): అతిపెద్ద అడ్డంకి
ఈసారి కూడా వీసా తిరస్కరణకు కారణంగా సెక్షన్ 214(బీ)ని చూపించారు. అమెరికా వలస చట్టాల ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి 'సంభావ్య వలసదారు' అని అధికారులు భావిస్తారు. దరఖాస్తుదారుడు తన పర్యటన ముగిసిన తర్వాత తిరిగి సొంత దేశానికి వస్తాడనే బలమైన సాక్ష్యాధారాలను చూపడంలో విఫలమైతే ఈ సెక్షన్ కింద వీసాను తిరస్కరిస్తారు.
అయితే ఆ కుటుంబం వాదన మరోలా ఉంది. తాజా ఇంటర్వ్యూ కేవలం రెండు నిమిషాల్లోనే ముగిసిపోయిందని, తమ ఆర్థిక స్థితిగతులు లేదా ఉద్యోగ బాధ్యతలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ప్రభుత్వ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న నిర్మాణ రంగ వ్యాపారిగా ఉండటం.. ఇంట్లో వృద్ధులను చూసుకోవాల్సిన బాధ్యత ఉండటం వంటి అంశాలేవీ అధికారులను మెప్పించలేకపోయాయి.
బంధుత్వాలే శాపమా?
ఈ ఉదంతంలో మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే ఆ కుటుంబానికి అమెరికాలో ఉన్న బలమైన సంబంధాలు. వారి ఒక కుమారుడు 2016 నుంచి అక్కడే స్థిరపడి వివాహం చేసుకుని ఉంటున్నారు. అలాగే తండ్రి సోదరుడు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్. సాధారణంగా విదేశాల్లో బంధువులు ఉంటే వీసా సులభంగా వస్తుందని భావిస్తారు. కానీ ఇక్కడ అదే వారికి ప్రతిబంధకంగా మారిందని అనుమానిస్తున్నారు. అమెరికాలోనే బంధువులు ఉండటం వల్ల వీరు కూడా అక్కడికి వెళ్లి తిరిగి రారేమోనన్న సందేహం అధికారులకు కలిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
నెటిజన్ల స్పందన.. ఆందోళన
ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు అమెరికా వీసా ప్రక్రియలోని అపారదర్శకతను తప్పుపడుతున్నారు. వేల రూపాయల ఫీజు చెల్లించి, నెలల తరబడి వెయిట్ చేసినా, కనీసం దరఖాస్తుదారుడి గోడు వినకుండానే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. బలమైన ఆర్థిక నేపథ్యం, ట్రావెల్ హిస్టరీ ఉన్నప్పటికీ వీసా రాకపోవడం విచారకరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ఈ ఘటన అమెరికా విజిటర్ వీసా పొందడం అనేది కేవలం అర్హతపైనే కాకుండా ఆ సమయానికి ఉండే 'లక్' పైన కూడా ఆధారపడి ఉంటుందనే చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.