మాజీ మంత్రి అంబటి ఒకరోజు దీక్ష.. టీడీపీ వ్యంగ్యస్త్రాలు!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు 12 గంటల నిరాహారదీక్ష ముగిసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష చేశారు.;

Update: 2026-04-19 08:17 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు 12 గంటల నిరాహారదీక్ష ముగిసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష చేశారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ నిరసన దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష విఫలమైందని, కనీసం వంద మంది కూడా అంబటికి సంఘీభావం తెలిపేందుకు రాలేదంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.

గుంటూరు వేదికగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నిర్వహించిన నిరసన దీక్ష రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. జనవరి 31న తన ఇంటిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, తనను అరెస్టు చేసి 18 రోజులు జైలులో పెట్టిన పోలీసులు, తన ఇంటిపై దాడి చేసిన కార్యకర్తలను కనీసం 18 నిమిషాలు కూడా పోలీసు స్టేషన్ లో పెట్టలేదని అంబటి రాంబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తనను అరెస్టు చేసిన నల్లపాడు పోలీసులు కస్టడీలో హింసించారని ఆరోపించారు.

పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని అంబటి ఆరోపించారు. పోలీసులు తమ వాహనాలకు టీడీపీ జెండాలు కట్టుకుని తిరగాలని ధ్వజమెత్తారు. దాడిని ప్రోత్సహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టమని మాజీ మంత్రి అంబటి హెచ్చరించారు.

అయితే అంబటి దీక్షకు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి నూరీ ఫాతిమా సంఘీభావం తెలిపారు. పలువురు కార్యకర్తలు సైతం అంబటి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అయితే అధికార పక్షం మాత్రం అంబటి దీక్షను ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ దీక్షతో అంబటికి ప్రజల్లో ఎంత బలం ఉందో స్పష్టమైందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం వంద మంది అయినా దీక్షా శిబిరాన్ని సందర్శించలేదని, పట్టుమని పది మంది కూడా శిబిరం లేరంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో అంబటి దీక్షపై ఇరుపార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

Tags:    

Similar News