రౌడీ కోతి.. 50 వేలు ఇచ్చి వ‌దిలించుకున్నారు!

కోతులు.. అవి చేసే చేష్ఠ‌లు మ‌న‌కు కొత్త‌కాదు. తెలంగాణ‌లోని జ‌గిత్యాల స‌హా ప‌లు జిల్లాల్లో కోతుల బెడ‌ద ఉంది.

Update: 2026-10-23 14:51 GMT

ఎక్క‌డైనా స‌మాజానికి ఇబ్బందిగా ఉన్న వ్య‌క్తుల‌పై రివార్డులు ప్ర‌క‌టించి.. వారిని ప‌ట్టుకునేలా చేసి.. ప్ర‌జ‌లు వారి నుంచి విముక్తి పొందుతారు. స‌ద‌రు వ్య‌క్తుల‌ను జైలు పాలు చేసేందుకు స‌హ‌క‌రిస్తారు. కానీ, చిత్రంగా ఓ కోతి విష‌యంలో ఏకంగా ప్ర‌భుత్వమే స్పందించి.. 51 వేలు ఇచ్చి వ‌దిలించుకుందంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. కానీ.. ఇది వాస్త‌వం. మ‌న ద‌గ్గ‌ర కాక‌పోయినా.. హ‌రియాణాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆస‌క్తిగా మారింది.

కోతులు.. అవి చేసే చేష్ఠ‌లు మ‌న‌కు కొత్త‌కాదు. తెలంగాణ‌లోని జ‌గిత్యాల స‌హా ప‌లు జిల్లాల్లో కోతుల బెడ‌ద ఉంది. అలానే.. అనంత‌పురం వంటి ఏపీ జిల్లాల్లోనూ కోతుల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌లు ఉన్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు వ‌ల‌లు పెట్టి వాటిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, హ‌రియాణాలో ఓ కోతి మాత్రం అచ్చంగా రౌడీని మించిపోయిన త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రించింది. దీంతో ప్ర‌జ‌లు భీతిల్లిపోయారు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వాన్ని కూడా కుదిపేసింది.

హ‌రియాణాలోని ప‌ల్వ‌ల్ జిల్లా హ‌థీన్ మునిసిపాలిటీలో ఓ కోతి ప్ర‌జ‌ల కంటిపై కునుకు లేకుండా చేసింది. అది వ‌చ్చిందంటే.. ఎవ‌రినో ఒక‌రిని గీరేయ‌డం, క‌ర‌వ‌డం, వారిపై దాడులు చేయ‌డం ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారిపోయింది. దీంతో ఆ ప‌ట్ట‌ణ వాసులు భ‌య భ్రాంతుల‌కు గుర‌య్యారు. గ‌త ఆరు మాసాల్లో 50 మందిని కోతి క‌రిచిన‌ట్టు రికార్డులు న‌మోద‌య్యాయి. ఇక‌, వ‌స్తువులు, స‌రుకుల సంగ‌తి చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం అటవీ శాఖ అధికారుల‌కు కూడా చేరింది. కానీ, వారు ప‌న్నిన వ‌ల‌ల‌ను కూడా ఈ కోతి పాడు చేయ‌డంతో వారు కూడా చేతులు ఎత్తేశారు. చివ‌ర‌కు ప్ర‌భుత్వం ఈ కోతి బాధ్య‌త‌ను మునిసిపాలిటీకి అప్ప‌గిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. వారు కూడా ప్ర‌య‌త్నం చేశారు. అయినా.. కోతి దారికి రాలేదు. దీంతో మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ కోతిని ప‌ట్టిచ్చిన వారికి 51 వేల రివార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

దీంతో ఓ ఇద్ద‌రు యువ‌కులు కోతిని వారం రోజుల పాటు శ్ర‌మించి బంధించారు. రెండు చేతులు వెన‌క్కి క‌ట్టి.. బండిపై తీసుకువెళ్లి మునిసిపాలిటీ అధికారుల‌కు అప్ప‌గించారు. అయితే..వారు కోతిని తీసుకువెళ్తున్న స‌మ‌యంలో విష‌యం తెలుసుకున్న మ‌ర్క‌టం బాధితులు దానిని తెగ తిట్టిపోసి.. దాడి చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

Tags:    

Similar News