పాలు ఇవ్వని ఆవులకూ ఆశ్రయం.. అనంత్ అంబానీ జంతుప్రేమ వెనుక ఉన్న అసలు సందేశం ఇదే..

అనంత్ అంబానీ జంతు సంక్షేమ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనది గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వనతారా.

Update: 2026-10-23 13:08 GMT

సాధారణంగా వ్యాపారవేత్తల కుటుంబాలు.. వారి వారసులు వార్తల్లో నిలిచారంటే అది నిధుల సమీకరణ, కొత్త వ్యాపారాలు లేదా విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన అంశాలే అయి ఉంటాయి. కానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మాత్రం ఇందుకు భిన్నమైన బాటలో పయనిస్తున్నారు. తన వ్యాపార బాధ్యతలతో పాటు మూగజీవాల సంరక్షణ, జంతు సంక్షేమాన్ని తన జీవన విధానంగా మార్చుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ద్వారా ఆయన చేస్తున్న జంతు సంరక్షణ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆర్థికంగా ఉపయోగపడని.. అనగా పాలు ఇవ్వని ఆవులకు కూడా ఆశ్రయం కల్పిస్తున్నారనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.

సాంప్రదాయ పశుపోషణలో ఆవుల నుంచి వచ్చే పాల ఉత్పత్తికే ఆర్థిక ప్రాధాన్యం ఉంటుంది. పాలు ఇవ్వడం ఆగిపోయిన ఆవులను, వృద్ధాప్యానికి చేరిన పశువులను పోషించడం సగటు రైతుకు లేదా యజమానికి తీవ్రమైన ఆర్థిక భారంగా మారుతుంది. పశువుల ఆహారం, వైద్యం, నివాసం కోసం అయ్యే ఖర్చులు తట్టుకోలేక చాలామంది వాటిని రోడ్లపైకి వదిలేస్తుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాలు ఇవ్వని ఆవులకు కూడా పూర్తిస్థాయి సంరక్షణ కల్పించడం జంతు సంక్షేమంలో అత్యంత విప్లవాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. దాదాపు 9 లక్షల ఆవుల సంరక్షణ జరుగుతుండగా.. అందులో సుమారు 7 లక్షల ఆవులు పాలు ఇవ్వనివని సమాచారం. ఇది సమాజంలోకి తీసుకెళ్లిన సందేశం మాత్రం చాలా గొప్పది. ఒక జంతువు నుంచి మనకు ఆర్థిక ప్రయోజనం లేనప్పుడు కూడా దాని జీవించే హక్కును గౌరవించగలమా అనే ప్రశ్నకు ఇది ప్రత్యక్ష సమాధానంగా నిలుస్తోంది.

అనంత్ అంబానీ జంతు సంక్షేమ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనది గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వనతారా. ఇది కేవలం సాధారణ పశువుల పాక కాదు.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన వన్యప్రాణి రక్షణ, చికిత్స , పునరావాస కేంద్రం. అనారోగ్యానికి గురైన, గాయపడిన జంతువులకు అత్యవసర చికిత్స అందించడంతో పాటు ప్రమాదాల్లో చిక్కుకున్న జంతువులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వెటర్నరీ అంబులెన్స్ సేవలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నిపుణులైన పశువైద్యులు, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా జంతువుల సహజ ప్రవర్తనకు అనుగుణంగా పునరావాసం కల్పించడం ఈ కేంద్రం ప్రత్యేకత.

కోట్లాది రూపాయల సంపద ఉన్నవారు దానిని సమాజ శ్రేయస్సుకు, మూగజీవాల సంక్షేమానికి కేటాయించడం ఎంతో అభినందనీయం. పెద్ద ఎత్తున నిధులు అందుబాటులో ఉన్నప్పుడు అత్యాధునిక ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, పరిశోధనా కేంద్రాలు నిర్మించడం సాధ్యమవుతుంది. అయితే ఈ తరహా బృహత్తర కార్యక్రమాలు విజయవంతం కావాలంటే జంతువులకు అందుతున్న చికిత్సా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, నిర్వహణలో పారదర్శకత పాటించడం అత్యంత ముఖ్యం. అంబానీ కుటుంబం చేస్తున్న ఈ తరహా కార్యక్రమాలు సాధారణ ప్రజలకు కూడా ఒక మంచి స్పూర్తిని ఇస్తున్నాయి. మూగజీవాల పట్ల దయ చూపడానికి వందల కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎండకాలంలో వీధి కుక్కలు, పక్షుల కోసం కాస్త మంచి నీళ్లు ఉంచడం, రోడ్డుపై గాయపడిన జంతువును చూసినప్పుడు సమీపంలోని పశువైద్య కేంద్రానికి సమాచారం ఇవ్వడం.. పశువులను హింసించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా మన పరిధిలోనే పెద్ద మార్పు తీసుకురావచ్చు.

అనంత్ అంబానీకి సంబంధించిన వీడియోలోని సంఖ్యలు ఎంతవరకు నిజమనే అంశాన్ని పక్కన పెడితే.. అది సమాజానికి ఇచ్చిన ఆలోచన అత్యంత విలువైనది. సంపద, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మానవీయ దృక్పథం ఒకచోట కలిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ కథనం నిరూపిస్తోంది. ఒక జీవి మనకు ఎంత లాభం తెస్తుందనేది కాదు.. అది బాధలో ఉన్నప్పుడు మనం ఎంత అండగా నిలుస్తున్నామన్నదే మన మానవత్వానికి అసలైన కొలమానం.

Tags:    

Similar News