ఇది బొత్స బ్రాండ్.. జడ్పీ ఎన్నికల్లో నలుగురు కుటుంబ సభ్యులకు టికెట్లు!

ఇక బొత్స తమ్ముడు కుమారుడు చైతన్య నెల్లిమర్ల మండలంలోని పూసపాటిరేగ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఈయన చాలాకాలంగా నెల్లిమర్ల నియోజకవర్గంపై దృష్టిపెట్టారు.

Update: 2026-10-23 12:28 GMT

విపక్షం వైసీపీలో తనకు తిరుగు లేదని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి నిరూపించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత కుటుంబం నుంచి నలుగురిని జడ్పీటీసీలుగా బరిలోకి దింపారు. బొత్స కుమార్తె అనూషతోపాటు కోడలు పూజిత, చెల్లెలు లక్ష్మి, తమ్ముడి కుమారుడు చైతన్య నాలుగు వేర్వేరు మండలాల నుంచి జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడం హాట్ టాపిక్ అవుతోంది. జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా తన కుమార్తె అనూష ఉంటుందని బొత్స ఇదివరకే ప్రకటించారు. ఈ ప్రకటన ఆయన కుటుంబంలో తీవ్ర దుమారం రేపింది. అయినప్పటికీ ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లే బొత్స సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న సమయంలో రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ విజయనగరం జిల్లాలో గెలిచి తీరుతామని బొత్స ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులలో ధైర్యం నింపేందుకు తన కుటుంబ సభ్యులనే ముందుకు తెచ్చారని అంటున్నారు.

జడ్పీ ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి నలుగురు ఒకేసారి పోటీ చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా, బొత్స మూడు నియోజకవర్గాల పరిధిలో నాలుగు చోట్ల తన కుటుంబ సభ్యులను పోటీకి పెట్టడమే హాట్ టాపిక్ అవుతోంది. తన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోడలు పూజితను పోటీకి పెట్టారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు సంధ్య పోటీ చేస్తున్నారు. దీంతో గరివిడి జడ్పీటీసీ ఎన్నిక వేడి పుట్టిస్తోంది. మరోవైపు బొత్స చెల్లెలు లక్ష్మిని కూడా సొంత నియోజకవర్గంలోని గుర్ల నుంచి పోటీకి పెట్టారు బొత్స. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా బొత్స పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా, అందులో రెండు చోట్ల తన కుటుంబ సభ్యులను పోటీకి పెట్టడం ద్వారా, ఇటీవల టీడీపీలో చేరిన తన మేనల్లుడు చిన్న శ్రీనుకు చెక్ చెప్పేలా బొత్స వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

ఇక బొత్స తమ్ముడు కుమారుడు చైతన్య నెల్లిమర్ల మండలంలోని పూసపాటిరేగ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఈయన చాలాకాలంగా నెల్లిమర్ల నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. అక్కడ ఇన్నాళ్లు తమ కుటుంబానికే చెందిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కారణంగా చైతన్య వెనక్కి తగ్గాల్సివచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం బడ్డుకొండ వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో చైతన్యకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. మరోవైపు ఇటీవల భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న బొత్స కుమార్తె అనూష సైతం జడ్పీటీసీ ఎన్నికల బరిలో దిగడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తవానికి అనూష జడ్పీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని బొత్స గత ఆగస్టులోనే ప్రకటించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎక్కడో ఒక చోట ఆమెను బరిలోకి దించి గెలిపించాలని భావించారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను పార్టీ మారడం, ఆయన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో అనూషను గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి నుంచి పోటీకి పెట్టినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విధంగా కుటుంబం నుంచి నలుగురిని పోటీకి పెట్టిన బొత్స వైసీపీలో తన నిర్ణయమే ఫైనల్ అన్న సంకేతాలను మరోసారి పంపారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స నిర్ణయాన్ని వ్యతిరేకించలేని వాతావరణం కూడా ఉండటం ఆయనకు కలిసివచ్చిందని అంటున్నారు. నిజానికి బొత్స ఏ పార్టీలో ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తారని చెబుతుంటారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు కానీ, ప్రస్తుతం వైసీపీలో బొత్స కుటుంబానికి చెందిన ముగ్గురు లేదా నలుగురికి చట్టసభలకు పోటీ చేసే అవకాశం దక్కేది 2024 ఎన్నికల్లో మొత్తం నలుగురు పోటీ చేయగా, అందరూ ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీలో ఆయన ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించేలా ప్రస్తుతం నలుగురు కుటుంబ సభ్యులను పోటీకి పెట్టడాన్ని చూపుతున్నారు.

Tags:    

Similar News