అయినా మార్పు రాలేదు.. జగన్ సంచలన వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు సూచనలతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయడాన్ని అస్త్రంగా చేసుకున్న మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంపై మాటల దాడిని పెంచారు.
సుప్రీంకోర్టు సూచనలతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయడాన్ని అస్త్రంగా చేసుకున్న మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంపై మాటల దాడిని పెంచారు. తమ పార్టీ నేతలతో నామినేషన్లు వేయించే పరిస్థితి లేకపోవడాన్ని ఎత్తిచూపడమే కాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై ప్రజలలో అవగాహన కల్పించేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తొలిరోజుల్లో బెంగళూరులో ఉన్న జగన్ రెడ్డి సుప్రీంకోర్టు విచారణ తర్వాత తాడేపల్లికి రావడమే కాకుండా, పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపేలా వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో తమ పార్టీకి సానుకూలంగా వచ్చిన నిర్ణయంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపడానికి ప్రయత్నిస్తున్న జగన్ రెడ్డి, ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై మరోసారి ఫైర్ అయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార కూటమి దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, చట్టం, రాజ్యాంగం అనేవి అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయలేని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను జగన్మోహన్ రెడ్డి ఎత్తిచూపారు. వైయస్సార్సీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధపడిన అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగడమే కాకుండా, భౌతిక దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. నామినేషన్ పత్రాలను లాక్కోవడం, అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు పోటీలో లేకుండా చేసేందుకు పక్కా పథకం ప్రకారం ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పోలీసు అధికారులు అధికార పార్టీకి ఏజెంట్లుగా, తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. అరాచకాలు జరుగుతున్నా పోలీసులు కనీసం అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించడమే కాక, బాధితులైన ప్రతిపక్ష నాయకులపైనే కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అధికారులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిందని జగన్ గుర్తుచేశారు. ఏపీలో హింస, దాడులపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, "రాష్ట్రంలో అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోం" అని హెచ్చరించినా బాబు సర్కార్లో మార్పు రాకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో బాబు ప్రభుత్వానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని, 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంపు విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. 19 చోట్ల నామినేషన్లు వేయనీయకుండా తమను అడ్డుకున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, కోర్టు మొట్టికాయలు వేసినా కేవలం 4 చోట్ల మాత్రమే రీ నామినేషన్ కు అనుమతి ఇవ్వడాన్ని జగన్ రెడ్డి ఆక్షేపించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చంద్రబాబు, ఎన్నికల సంఘంలో మార్పురాలేదని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా గొంతుకను ఎవరూ అణచివేయలేరని ఆయన నొక్కిచెప్పారు. భయాందోళనలను పక్కనపెట్టి వైయస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు ధైర్యంగా అక్రమాలను ఎదుర్కొవాలని, రాజ్యాంగ బద్ధంగా తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.