బాబు శకుని...నిప్పులు చెరిగిన జగన్

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు.

Update: 2026-10-23 07:26 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో శకుని పాత్ర పోషించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా భారతంలో శకుని అనుకున్న నంబరే వస్తుందని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం బాబు సెట్ చేసి ప్రతిపక్షాలకు ఎక్కడా ఆస్కారం లేకుండా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని మండిపడ్డారు.

అష్ట కుట్రలతో :

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందుల జెడ్పీటీసీకు జరిగిన ఉప ఎన్నికలో పోలింగ్ బూతులను ఆక్రమించి గెలిచారు అని జగన్ విమర్శించారు. ఇపుడు దాని కంటే కూడా దిగజారి పోయారు అని అన్నారు. ఏకంగా నామినేషన్ కేంద్రాలనే ఆక్రమించి విపక్ష వైసీపీ నాయకులు ఎవరూ నామినేషన్లు వేయకుండా అడ్డు పడుతున్నారని జగన్ ఆరోపించారు. దీనికి ఎనిమిది కుట్రలను అమలు చేశారు అన్నారు. వైసీపీ అభ్యర్ధులు పోటీకి సిద్ధంగా ఉన్నారు అని తెలియగానే వారి మీద బైండోవర్ కేసులు పెట్టడం అలాగే ముందస్తు అరెస్టులు చేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు చేయించడం రిటర్నింగ్ అధికారి ఎదుటనే నామినేషన్ పత్రాలు చించయడం, పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారి చేత దాడులు చేయించడం, స్క్రూటినీలోనే నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేయించడం ఇలా టీడీపీ ఎనిమిది కుట్రలతో నామినేషన్ పర్వాన్ని సాగించింది అన్నారు.

వైసీపీ అభ్యర్ధులు లేకుండా :

వైసీపీ వారే లేకుండా ఎన్నికలు పెట్టడం దేనికి అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వాటిని ఎన్నికలు అంటారా అని బాబుని ప్రశ్నించారు. దీనికి బదులుగా నామినేట్ చేసుకుంటే సరిపోయేది కదా అని ఆయన బాబుకి సూచించారు. ఎంపీటీసీలు రాష్ట్రంలో ఆరు వందల దాకా ఉంటే అందులో రెండు వందల దాకా ఎక్కడా వైసీపీ నామినేషన్లే లేకుండా చేసారు అన్నారు. మరో రెండు వందల నామినేషన్లు పెండింగులో పెట్టారు అన్నారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో 23 దాకా మునిసిపాలిటీలలో వైసీపీ నుంచి నామినేషన్లు లేకుండా ఉన్న చోట నామమాత్రంగా చేసి తామే గెలిచేటట్టుగా చేసుకుని ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు.

సుప్రీం తీర్పుని :

దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుని కూడా ఖాతరు చేయకుండా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు కొనసాగిస్తోంది అని జగన్ విమర్శించారు. డీజీపీ తోలు బొమ్మ మాదిరిగా మారారని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తీర్పుని అనుసరించి రీనామినేషన్లు పెట్టకుండా కేవలం నాలుగు చోట్లకే పరిమితం అయింది అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యం గురించి చెబుతారా అని టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఈ తరహా ఎన్నికలను ఎవరూ చరిత్రలో చూసి ఉండరని జగన్ అన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ప్రతిపక్ష పాత్ర లేకుండా జరుగుపుతున్న స్థానిక ఎన్నికలను కూటమి గెలుపుగా భావించాలా అని ప్రశ్నించారు.

నమ్మకం లేకనే :

ధైర్యంగా ఎన్నికలు పెట్టి ప్రజలలో గెలుస్తామని నమ్మకం లేకనే టీడీపీ ఈ విధంగా చేస్తోంది అని జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏవీ నెరవేర్చలేదని అందుకే ఈ అడ్డ దారులు దొక్కుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు అని ఆయన హెచ్చరించారు. మొత్తానికి చూస్తే జగన్ టీడీపీ మీద ఎన్నికల సంఘం మీద పోలీస్ వ్యవస్థ మీద తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేశారు.

Tags:    

Similar News