తనపై 'స్మార్ట్ గ్లాసెస్' తో స్టింగ్ ఆపరేషన్.. బాంబు పేల్చిన కర్ణాటక సీఎం డీకే!
డీకే శివకుమార్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అధికారుల ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిశారు.
కర్ణాటక రాజకీయాల్లో 'స్టింగ్ ఆపరేషన్' కాకరేపుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదం ఒక కొత్త మలుపు తిరిగింది. రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా దృశ్యాలను బంధించేందుకు 'మెటా స్మార్ట్ గ్లాసెస్' వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నారని డీకే ఆరోపించడంతో కన్నడ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
స్మార్ట్ గ్లాసెస్ ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలే లక్ష్యమా?
డీకే శివకుమార్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అధికారుల ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిశారు. ప్రారంభంలో వ్యాపార, పెట్టుబడుల అంశాలపై మాట్లాడిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత మెల్లగా బూత్ స్థాయి వ్యూహాలు, అంతర్గత రాజకీయాలపై చర్చకు తెరలేపారు. ఆ సమయంలో సదరు వ్యక్తి ధరించిన 'మెటా స్మార్ట్ గ్లాసెస్' ఇందులో కెమెరా ఫీచర్ ఉన్న కళ్లద్దాలు డీకేకు అనుమానం కలిగించాయి.
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. సదరు పారిశ్రామికవేత్త తనతో పాటు కేరళ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ను కలిసినప్పుడు మాత్రమే ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరించారని డీకే పేర్కొన్నారు. కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్ లేదా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు మాత్రం వాటిని వాడలేదని ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ రహస్య చిత్రీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలో డీకే అనుమానాలు వ్యక్తం చేశారు. తన వద్ద దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయని.. తగిన సమయంలో ఆధారాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
కేబినెట్ హెచ్చరికలు.. సిద్ధరామయ్య వీడియోల కలకలం
ఈ పరిణామాలకు ముందే సిద్ధరామయ్యకు సంబంధించిన కొన్ని పాత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ వీడియోల ప్రసారాన్ని నిలిపివేస్తూ బెంగళూరు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో డీకే శివకుమార్ సహచర మంత్రులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. మంత్రులు, వారి వ్యక్తిగత సహాయకులు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ సంభాషణలు, రహస్య సమావేశాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
మరోవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం కార్యాలయాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు నిధులు సమకూర్చి స్టింగ్ ఆపరేషన్లకు కుట్ర పన్నుతున్నాయని ఎమ్మెల్యే రవికుమార్ గణిగ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం, సీక్రెట్ రికార్డింగులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త సవాలుగా మారింది. డీకే శివకుమార్ ఆరోపణల్లోని నిజానిజాలు, పోలీసుల దర్యాప్తు నివేదికలు బయటకు వస్తే తప్ప ఈ 'స్మార్ట్ గ్లాసెస్' రహస్యం పూర్తిస్థాయిలో వీడేలా లేదు.