ఏపీలో ఏం జరుగుతోంది? ధ్రువ్ రాఠీ వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో చర్చ?

ధ్రువ్ రాఠీ లాంటి సోషల్ మీడియా ప్రముఖుల పోస్టులు సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లగలవేమో కానీ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది వ్యవస్థలే.

Update: 2026-10-23 17:09 GMT

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, నామినేషన్ల అడ్డుగింపు ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తాజాగా ‘ఏపీలో ఏం జరుగుతోంది?’ అని ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజల స్వేచ్ఛా నిర్ణయమా? లేక రాజకీయ బలప్రదర్శనకు వేదికగా మారుతున్నాయా? అనే ప్రశ్నలు మరోసారి నెటిజన్ల నుంచి వస్తున్నాయి.

ఒక వీడియో.. జాతీయ స్థాయిలో చర్చ

మాజీ మంత్రి విడదల రజినిని ఒక పోలీసు అధికారి తోసివేస్తున్నట్లుగా ఉన్న వీడియోను ధ్రువ్ రాఠీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరవ్ దాస్ స్పందిస్తూ వ్యవస్థల ప్రక్షాళన అవసరమని వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఒక పూర్తి స్థాయి నిర్ధారణకు రావడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఘటన వెనుక అసలు వాస్తవాలు, పోలీసుల చర్యలకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలని విశ్లేషకులు కోరుతున్నారు.

స్థానిక ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష

అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో పౌరుల నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనలో స్థానిక ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర. అలాంటి ఎన్నికల్లోనే అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. బెదిరింపులకు పాల్పడడం వంటి వార్తలు రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఓటు వేసే స్వేచ్ఛ, అభ్యర్థుల భద్రత అనేవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. వాటికి భంగం వాటిల్లినప్పుడు అధికార, ప్రతిపక్షాలతో పాటు ఎన్నికల సంఘం కూడా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

ఈ పరిణామాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారుతున్నాయి. పారదర్శక పాలన, ప్రజాస్వామ్య విలువలే తమ ప్రాధాన్యమని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ విమర్శలుగా వీటిని కొట్టివేయకుండా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి. పోలీసులు కూడా ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా.. పూర్తిగా నిష్పాక్షికంగా విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది.

ధ్రువ్ రాఠీ లాంటి సోషల్ మీడియా ప్రముఖుల పోస్టులు సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లగలవేమో కానీ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది వ్యవస్థలే. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ ఎన్నికల ప్రక్రియపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటే అది సమాజానికి తీరని నష్టం. పరస్పర ఆరోపణలు మాని.. పారదర్శక విచారణ జరిపి, నిజమైన బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడం ద్వారానే ప్రజల్లో భరోసాను తిరిగి తీసుకురాగలం.

Tags:    

Similar News