భీముడు.. హనుమంతుడు.. మోడీ.. రేవంత్ రెడ్డి

తన వాదనను బలంగా.. అందరికి ఇట్టే అర్థమయ్యేలా చెప్పే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని టాలెంట్ ఉన్న ముఖ్యనేతలు పలువురు ఉన్నారు.;

Update: 2026-04-19 07:30 GMT

తన వాదనను బలంగా.. అందరికి ఇట్టే అర్థమయ్యేలా చెప్పే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని టాలెంట్ ఉన్న ముఖ్యనేతలు పలువురు ఉన్నారు. వారిలో కేసీఆర్.. రేవంత్.. కేటీఆర్.. హరీశ్ రావులు కనిపిస్తారు. ఈ విషయంలో ఏపీకి చెందిన కీలకనేతల్లో ఆ టాలెంట్ తక్కువనే చెప్పాలి. తాజాగా రాజ్యాంగ 131వ సవరణ బిల్లు వీగిన నేపథ్యంలో.. ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు వీగిపోవటం.. మహిళా బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆ వాదనను ఖండిస్తూ.. రేవంత్ తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన పిట్టకథ కాస్త ఆసక్తికరంగా మారింది. తనకు తిరుగు లేదన్నట్లుగా వ్యవహరించే మోడీ అహంకారానికి తాజాగా దెబ్బ పడిందన్న అర్థం వచ్చేలా మాట్లాడటం వరకు ఓకే.ఈ సందర్భంగా మహాభారతంలోని ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ అహంకారం ఎంతలా ఉంటుందో చెబుతూనే.. అదే సమయంలో దానికి దెబ్బ పడిందన్న అర్థాన్ని చెప్పిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ సీఎం రేవంత్ ఏం అన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘మహాభారతంలో భీమసేనుడు కూడా గొప్ప యోధున్ని అన్న అహంకారంతో విర్రవీగితే ఓ వృద్ధుడి రూపంలో వచ్చిన హనుమంతుడు బుద్ధి చెప్పి.. అహంకారాన్ని తొలగించారు. ప్రధాని మోదీ అహంకారం కూడా లోక్‌సభలో ప్రజల ముందు ఓడిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై మీడియా ప్రతినిధి ఒకరు సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తూ.. ‘‘మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకమని మోదీ ప్రచారం చేస్తారు కదా?’’ అని అడగ్గా.. మహాభారతంలో శకునికి ఏమైందో చూశారు కదా అని రేవంత్‌ వ్యాఖ్యానించటం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. మోడీని భీమసేనుడితో పోల్చటం.. తాను బలవంతుడ్ని అంటూ అహంకారంతో విర్రవీగిన వేళ.. ఎదురుదెబ్బలు హనుమంతుడి రూపంలో ఎదురవుతాయన్న పోలిక కొంతమేర సూట్ అవుతుందనే చెప్పాలి. అయితే.. ఇదంతా ప్రజల నుంచి వచ్చిందనే కన్నా.. విపక్షపార్టీలు ఈ విషయంలో తగ్గేదేలే.. అన్నట్లుగా వ్యవహరించటంతోనే అన్నది మర్చిపోకూడదు. విపక్షాలు కోరినట్లుగా బిల్లులో మార్పులు చేసేందుకు..దేశంలోని రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై ఒక జాబితా ఇవ్వాలని కోరుతూనే.. మళ్లీ విషయాన్ని పక్కన పెట్టేయటం.. తాము అడిగినట్లే.. రాష్ట్రాల్లో ఎన్నేసి సీట్లు పెరుగుతాయన్న దానిపై పదిహేను నిమిషాల్లో సభ ముందుకు పెడతామని అమిత్ షా స్వయంగా చెప్పినప్పటికి.. విషయాన్ని పక్కకు తీసుకెళ్లేలా చేసి.. అమిత్ చెప్పిన లిస్టు రెఢీ కాకుండా ఉండేలా చేయటంలో విపక్షాలు సూపర్ సక్ అయ్యాయని చెప్పాలి. ఏమైనా.. టైమ్లీగా పురాణాల్లోని క్యారెక్టర్లను తెర మీదకు తీసుకొచ్చి పిట్టకథలతో అత్యుత్తమ స్థాయి వారికి చేరువయ్యేలా సీఎం రేవంత్ టాలెంట్ ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News