పవన్ కు మోదీ ఫోన్.. స్వయంగా ట్వీట్ చేసిన ప్రధాని
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సైనసైటీస్ తో బాధపడుతూ శనివారం అత్యవసర శస్ర్తచికిత్స చేయించుకున్న పవన్ ను ప్రధాని పరామర్శించారు.;
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సైనసైటీస్ తో బాధపడుతూ శనివారం అత్యవసర శస్ర్తచికిత్స చేయించుకున్న పవన్ ను ప్రధాని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కు ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన అధికారిక ‘ఎక్స్’ అకౌంటులో ట్వీట్ చేసి వెల్లడించారు. దీంతో అగ్రనేత, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి తెరపైకి వచ్చింది.
పవన్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాగా, ప్రధాని ట్వీట్ పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు తెలియజేస్తూ రీట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చూపిన అభిమానం, ఆయన ప్రోత్సాహం తనకు గొప్ప బలాన్ని ఇచ్చినట్లు పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పవన్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తోపాటు విపక్ష నేత జనగ్ కూడా ట్వీట్ చేశారు.
శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలోనే పవన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించగా, పవన్ కు సైనస్ ఉన్నదని వెంటనే శస్ర్తచికిత్స చేయించాలని వైద్యులు స్పష్టం చేశారు.
శనివారం సాయంత్రం ముక్కుకు శస్ర్తచికిత్స చేసిన అనంతరం ఇంటికి పంపించారు. అయితే ఆయన కోలుకోవడానికి సుమారు 10 రోజుల సమయం పడుతుందని, విశ్రాంతి అనంతమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ కు వైద్యులు సూచించారు. దీంతో పవన్ అధికారిక కార్యక్రమాలను వారం పాటు రద్దు చేస్తున్నట్లు ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రకటించారు.