తెలుగు ఓటర్లే టార్గెట్.. ఎన్డీఏకి మద్దుతగా రంగంలోకి చంద్రబాబు

తమిళనాడు ఎన్నికలకు కీలక దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.;

Update: 2026-04-19 08:15 GMT

తమిళనాడు ఎన్నికలకు కీలక దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంట్రీ ఇస్తున్నారు. రెండు రోజుల పాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఎన్డీఏ తరఫున చంద్రబాబు పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన తమిళనాడులో పలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.

తమిళనాడులో ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు సీఎం టూర్ ను అధికారికంగా ధ్రువీకరించారు. సోమవారం మధ్యాహ్నం రాజధాని అమరావతి నుంచి చంద్రబాబు నేరుగా కోయంబత్తూరు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో పర్యటిస్తారు.

ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలు, రోడ్ షోలకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హోసూరు సమీపంలో తాలిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. ఈ ప్రాంతంలో తెలుగు వాళ్లు అధికంగా నివసిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక చెన్నైకి సమీపంలో ఆవడిలో చంద్రబాబు రోడ్ షో కి రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇక చంద్రబాబు రాకను స్వాగతిస్తూ ఎన్డీఏ అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెన్నై టీడీపీ కూడా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో తెలుగు మాట్లాడేవారు అధికంగా నివసిస్తున్నారు. అంతేకాకుండా చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి వంటి నగరాల్లో తెలుగు మాట్లాడే వారి జనాభా ఎక్కువగా ఉందని అంచనా. తమిళనాడులో దాదాపు 40 శాతం మంది తెలుగు సంతతికి చెందిన ఓటర్లే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పలువురు తెలుగు నేతలకు ప్రధాన పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఇక ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ రంగంలోకి దింపిందని అంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ నేతగా చంద్రబాబు ప్రభావం ఉంటుందని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు తమిళనాడుతో ఉన్న అనుబంధం, ఏపీ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడిన ఓటర్లను ఆకర్షించడానికి చంద్రబాబు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు మహరాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. తాజాగా సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులో చంద్రబాబును ప్రత్యేకంగా తీసుకువెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News