ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్మూజ్ పై స్టాండ్ ఇదే అంటూ ప్రకట..!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను వణికించేలా ఉన్నాయి.;
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను వణికించేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘హార్మూజ్ జలసంధి’ మూసివేత అనేది కేవలం అమెరికాకో, ఇజ్రాయెల్‌కో సంబంధించిన సమస్య కాదు.. అది ప్రపంచ దేశాలన్నింటికీ తలనొప్పిగా మారే అంశం.
హార్మూజ్‌పై ఉక్కుపిడికిలి..
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని కేంద్రంగా చేసుకొని ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ కీలక జలమార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ చెప్పారు. అమెరికా ఆర్థిక, సైనిక శక్తిపై ఆయన చేసిన విమర్శలు పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి.
హార్మూజ్ ప్రపంచ దేశాల గళం..
ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సుమారు 20 నుండి 30 శాతం ఈ సన్నని జలసంధి గుండానే వెళ్తుంది. గాలిబాఫ్ అన్నట్లుగా, అమెరికా తన సైనిక బలంతో ఈ జలసంధిని అదుపులోకి తీసుకోవాలని చూసింది. కానీ, ఇరాన్ క్షిపణి దళాలు, డ్రోన్ వ్యవస్థల పహారా ముందు అగ్రరాజ్యం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌ను ప్రపంచం నుంచి వేరు చేయాలని అమెరికా చూస్తే, తాము ప్రపంచ ఇంధన సరఫరానే నిలిపివేస్తామనే హెచ్చరికను ఇరాన్ పరోక్షంగా ఇస్తోంది. ఒకవేళ హార్మూజ్ మూతపడితే భారత్ వంటి చమురు దిగుమతి దేశాల్లో పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరిగే ప్రమాదం ఉంది.
ట్రంప్ వ్యూహాలపై ‘గాలిబాఫ్’ నిప్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై గాలిబాఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెనిజులాలో పాలన మార్పు కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఇరాన్ గడ్డపై సాగవని హెచ్చరించారు. ఇక్కడి ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో అగ్రరాజ్యం విఫలమైందని ఎద్దేవా చేశారు. అమెరికా వద్ద డబ్బు, ఆయుధాలు ఉండవచ్చు కానీ, వాటిని సరిగ్గా ఉపయోగించే ‘ప్రణాళిక’ లేదని ఆయన విశ్లేషించారు. పరిమిత వనరులతోనే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
‘అమెరికా ఫస్ట్’ కాదు.. ‘ఇజ్రాయెల్ ఫస్ట్’!
ట్రంప్ ఎన్నికల నినాదమైన 'అమెరికా ఫస్ట్'ను గాలిబాఫ్ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ అమెరికా ప్రయోజనాల కంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన నినాదం 'ఇజ్రాయెల్ ఫస్ట్' గా మారిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి అమెరికా తన విదేశీ విధానాలను నాశనం చేసుకుంటోందని, అందుకే ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా తమతో చర్చలకు విజ్ఞప్తులు పంపుతోందని సెటైర్లు వేశారు.
ఇరాన్ తన రేవులపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని పట్టుబట్టడం, అమెరికా అందుకు ససేమిరా అనడం మధ్య హార్మూజ్ జలసంధి బందీగా మారింది. యుద్ధంలో ఇరాన్ సాధించిన ‘పైచేయి’ చూసి అమెరికా భయపడిందని గాలిబాఫ్ చెబుతున్న మాటలు.. పశ్చిమాసియాలో ఇరాన్ ప్రాబల్యం పెరుగుతోందనడానికి సంకేతం. అయితే, ఈ మాటల యుద్ధం క్షేత్రస్థాయిలో నిజమైన యుద్ధానికి దారితీస్తే మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం ఖాయం.