కన్ఫమ్.. శశికళ కోరిక నెరవేరదు

Update: 2017-02-23 13:40 GMT
జైలు శిక్ష పడితే పడింది. ఆ శిక్ష ఏదో తమిళనాడు జైల్లో అనుభవిస్తే.. తన పని కొంచెం తేలికవుతుందని భావిస్తోంది శశికళ. ఎలాగూ తాను ముఖ్యమంత్రిగా నిలబెట్టిన పళని స్వామే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు కాబట్టి తమిళనాడు జైలుకు వెళ్తే అక్కడే రాజభోగాలు అనుభవించవచ్చన్నది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. కానీ ఆమెకు ఆ అవకాశం దక్కేలా లేదు. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను చెన్నై జైలుకు తరలించడం అంత సులభం కాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య స్పష్టం చేశారు.

శశికళకు శిక్ష విధించింది సుప్రీం కోర్టని.. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే ఆమె పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని.. శశికళను చెన్నై జైలుకు తరలించాలంటే సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వాలని ఆయన తెలిపారు. తనను చెన్నై జైలుకు తరలించాలని శశికళ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే కర్ణాటక ప్రభుత్వం తప్పకుండా కోర్టులో అభ్యంతంరం వ్యక్తం చేస్తుందని న్యాయవాది ఆచార్య స్పష్టం చేశారు. ఇప్పటికే శశికళ అభ్యర్థనను కర్ణాటక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. చెన్నై జైలుకు తనను తరలించాలని శశికళ కోరితే.. పరప్పన అగ్రహార జైల్లో శశికళకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో.. ఆమెకు ఇక్కడ ఎలాంటి సమస్యలున్నాయో.. ఎందుకు చెన్నై జైలుకు వెళ్లాలని అడుగుతున్నారో చెప్పాల్సి ఉంటుందని.. ఆమె వివరణ పూర్తి సంతృప్తికరంగా ఉంటే తప్ప సుప్రీం కోర్టు అందుకు అంగీకరించదని ఆచార్య స్పష్టం చేశారు. ఆచార్య మాటల్ని బట్టి చూస్తుంటే.. శశికళ చెన్నై జైలుకు వెళ్లే అవకాశాలు దాదాపు లేవన్నట్లే కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News