చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. వైసీపీకి షాక్!
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది. గత ప్రభుత్వంలో ఆయనపై నమోదైన అవినీతి కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.;
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది. గత ప్రభుత్వంలో ఆయనపై నమోదైన అవినీతి కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వైసీపీ అధికారంలో ఉండగా, ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై కేసు పెట్టింది. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో చంద్రబాబుతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్ చిట్ లభించింది. 2014-19 మధ్య ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో నిబంధనలు ఉల్లంఘించి వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని దానివల్ల కార్పొరేషన్ కు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.
ఇక నాటి వైసీపీ పెద్దల ఆదేశాలతో సీఎం చంద్రబాబుతోపాటు అప్పటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కే.సాంబశివరావు, టెర్రా సాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేరు కంపెనీలు వాటి ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చారు. మొత్తం 99 మందిని సాక్షులుగా చూపారు. కేసు దర్యాప్తు పూర్తయినట్లు కొద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేది ఇచ్చారు. అయితే ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి గత నెల 24 కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అఫిడవిట్ ఇచ్చారు.
ఇక కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతంరెడ్డి రంగం ప్రవేశం చేశారు. తీర్పు ఇచ్చేముందు తన వాదనలను వినాలని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి విచారణ అర్హత లేదంటూ న్యాయాధికారి పి.భాస్కరరావు పిటిషన్ ను గురువారం కొటటిపారేశారు. ఆ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. రాజకీయ కుట్రతోనే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అభియోగాలను నిరూపించలేకపోయిందని అంటున్నారు. అక్రమాలు జరగలేదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేయడంతో ఆయనపై అవినీతి ముద్ర వేసి గత ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.
ఇక గత ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనను లక్ష్యంగా చేసుకుని వరుస కేసులు నమోదయ్యాయి. ఇందులో ఫైబర్ నెట్ కేసు కూడా ఒకటి. గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు 3.0 సర్కారులో ఫైబర్ నెట్ ప్రారంభించారు. దీని ద్వారా ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యాలను ప్రభుత్వం అందించింది. అయితే 2019 వరకు సక్రమంగా సాగిన ఫైబర్ నెట్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. మరోవైపు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో చంద్రబాబు సర్కారు అవినీతి చేసిందని ఆరోపిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసులు, అరెస్టులు చేయించడంతో పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఇప్పుడు కేసును కోర్టు కొట్టి వేయడంతో చంద్రబాబుపై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని తేలిపోయిందని టీడీపీ చెబుతోంది.