పాకిస్థాన్ దానంతటదే 12 ముక్కలు.. పీవోకేలో వేలు పెడుతుందా?
పాకిస్థాన్ లో ఉన్న నాలుగు ప్రావిన్సుల్లో బలూచిస్థాన్, ఖైబర్ అత్యంత సమస్యాత్మకం అనే సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో బలూచిస్థాన్ సొంత దేశమే కావాలంటోంది.;
తస్మాత్ జాగ్రత్త..! బంగ్లాదేశ్ ఉదాహరణ గుర్తుందిగా..! భారత్ జోలికొస్తే పాకిస్థాన్ మళ్లీ ముక్కలవుతుంది ఖబడ్డార్..! ఇదీ మన పాలకులు తరచూ చేసే హెచ్చరికలు.. దీనిని నిజం చేస్తూ పాకిస్థాన్ ముక్కలవుతోంది. అది ఒకటి, రెండు కాదు ఏకంగా 12 భాగాలు అవుతోంది. ఇప్పటికే అంతర్గర సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది.. ఆర్థికంగా కుదేలైన శత్రుదేశం.. రాజకీయంగా సమస్యల్లో ఉన్న ఉగ్రవాద పెద్దన్న ఇకమీదట భౌగోళిక పటంలో భిన్నంగా కనిపించనుంది..! ఇదంతా భారత్ తో కయ్యం పెట్టుకున్నందుకు ఫలితమా? అంటే కాదని కూడా చెప్పలేం. 1947లో భారత్ నుంచి విడిపోయిన పాక్ లో మొదటి రోజుల్లో ఐదు ప్రావిన్సులు (రాష్ట్రాలు) ఉన్నాయి. వీటిలోంచి తూర్పు పాకిస్థాన్ (నేటి బంగ్లాదేశ్) 1971లో విడిపోయింది. భాష, కల్చర్ పూర్తిగా భిన్నంగా ఉన్న తమపై పాక్ సైనిక పాలకుల పెత్తనాన్ని తట్టుకోలేక మొదలైన బంగ్లా స్వాతంత్ర్య పోరాటం భారత ప్రభుత్వ తోడ్పాటుతో ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. దాదాప 25 కోట్ల జనాభాతో 3.40 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో 33వ పెద్ద దేశమైన పాక్ లో దీంతో నాలుగు ప్రావిన్సులే మిగిలాయి.
4 రాష్ట్రాల్లో మూడేసి చొప్పున...
సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తూంక్వా, పంజాబ్.. ఇవీ ప్రస్తుత పాక్ లో ఉన్న నాలుగు ప్రావిన్సులు. వీటిని ఒక్కోటి మూడు భాగాలుగా విభజించనున్నారు. వాస్తవానికి 75 ఏళ్లకు పైగా ఒక దేశంలో నాలుగే ప్రావిన్సులు కొనసాగడం అంటే అక్కడ పాలన ఎంత అధ్వాన స్థితిలో ఉందో తెలుస్తోంది. కానీ, అది పాకిస్థాన్ కాబట్టి అంతే అనుకోవాలి.
ఉన్నవే నాలుగు.. అందులో రెండు సమస్యాత్మకం
పాకిస్థాన్ లో ఉన్న నాలుగు ప్రావిన్సుల్లో బలూచిస్థాన్, ఖైబర్ అత్యంత సమస్యాత్మకం అనే సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో బలూచిస్థాన్ సొంత దేశమే కావాలంటోంది. ఖైబర్ లో ఉగ్రవాదం తీవ్రంగా ఉంది. ఇప్పుడు వీటిలో నుంచి మూడేసి ప్రావిన్సులు కొత్తగా రానున్నాయి. ప్రావిన్సుల విభజనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చర్చించారని.. విభజన త్వరలో అమలవుతుందని చెబుతున్నారు.
భారత సరిహద్దులో ఉన్నవి ఎన్నో?
దేశ విభజన సమయంలో పంజాబ్ రాష్ట్రంలో కొంత పాక్ కు వెళ్లింది. అది పశ్చిమ పంజాబ్ గా కొన్నాళ్లు సాగింది. ఈ రాష్ట్రంతో పాటు సింధ్ ప్రాంతం కూడా భారత్ సరిహద్దులో ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రాల విభజనతో భారత సరిహద్దులో ఎన్ని కొత్త ప్రావిన్సులు వస్తాయో చూడాలి. ఇక స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బలూచిస్థాన్, తూర్పు బెంగాల్, సింధ్, పశ్చిమ పంజాబ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (ఖైబర్). పాతవి నాలుగు పోగా.. మరిప్పుడు కొత్తగా ఏమేం వస్తాయో చూడాలి. పాక్ లో ప్రావిన్సుల విభజన సరే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోనూ విభజన చేస్తుందా? అన్నది కీలకం. ఒకవేళ పని చేస్తే భారత్ ఎలా స్పందిస్తుంది? అన్నది చర్చనీయం.