తరగతిలో టీచర్ చేసిన పనితో షాక్.. వీడియో తీసి బయటపెట్టిన విద్యార్థులు

కానీ, కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది.;

Update: 2025-12-13 08:53 GMT

టీటీడీలో అన్యమతస్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీవారి సన్నిధిలో పనిచేస్తూ అన్యమత ప్రచారం చేయడం నేరమని తెలిసినా కొందరు ఉద్యోగులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీలో అన్యమత ఉద్యోగులను తప్పించే వ్యవహారంపై దృష్టిపెట్టింది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి అన్యమతస్తులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని, లేదంటే ఇతర శాఖలకు బదిలీపై వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు బోర్డు చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఆమోదించింది. ఇలాంటి సమయంలోనే టీటీడీ పరిధిలో నడుస్తున్న ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ తరగతి గదిలో అన్యమత ప్రచారం చేస్తూ దొరికిపోయారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ మాధవి తరగతి గదిలో బ్లాక్ బోర్డుపై తెలుగులో అన్యమతానికి చెందిన దేవుడి పేర్లు రాస్తున్నట్లు ఉన్న ఒక వీడియో శనివారం బయటకు వచ్చింది. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు.

కానీ, కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది. ఇప్పటికే టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాల్సివుందని డిమాండ్ చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తున్నారని పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆసుంతాపై చర్యలు తీసుకున్నారు. ఆమెపై ఈవోకు సహచర ఉద్యోగులే ఫిర్యాదు చేయడంతో ఆమెను ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేశారు. అయితే ఇప్పుడు టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇటువంటి వారంతా తప్పనిసరిగా ఉద్యోగ విరమణ చేయాల్సివుంటుందని అంటున్నారు. టీటీడీలో మొత్తం 29 మంది అన్యమతస్తులు పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. వీరిలో పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ మాధవి పేరు ఉందో లేదో కానీ, ఆమె చేసిన పనిపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి 2018లోనే టీటీడీలో అన్యమతస్తుల తొలగింపునకు నాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అప్పట్లో టీడీడీలో మొత్తం 40 మంది హిందూయేతరులు ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఈ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడింది. ఈ కాలంలో అన్యమత్తులపై తీవ్ర విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపించాయంటున్నారు. ఇక గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో అన్యమతస్తులపై నిఘా పెంచింది. గతంలో గుర్తించిన వారిని టీటీడీ నుంచి బయటకు పంపాలని భావించింది. అయితే అప్పట్లో గుర్తించిన వారిలో కొందరు ఉద్యోగ విరమణ చేయడం, మరికొందరు చనిపోవడంతో ప్రస్తుతం 29 మంది మాత్రమే అన్యమతస్తులు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. వీరందరినీ కంపల్సరీ రిటైర్మెంటుకు ప్రభుత్వం ఆదేశించిన రోజుల వ్యవధిలోనే మరో ఉదంతం బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ పరిస్థితుల్లో లెక్చరర్ మాధవిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News