50కి పైగా దేశాలను పాలించిన బ్రిటీష్.. కానీ అన్ని దేశాల్లో జరిగిందిదే..

ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ పాలన ప్రభావం చాలా లోతుగా ఉంది. ఘానా 1957లో స్వాతంత్ర్యం పొందడం ద్వారా ఆఫ్రికాలో తొలి బ్రిటిష్ కాలనీగా విముక్తి సాధించింది.;

Update: 2025-12-13 06:54 GMT

బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు ‘సూర్యుడు అస్తమించని రాజ్యం’గా చెప్పుకునే స్థాయిలో విస్తరించింది. ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాశ్చం, కరేబియన్ దీవులు, పసిఫిక్ ప్రాంతాలు ప్రపంచం అంతటా బ్రిటన్ పరిపాలన ముద్ర కనిపించింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మారింది. ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్య ఆకాంక్షలు, జాతీయ చైతన్యం బలపడడంతో ఒకొక్కటిగా దేశాలు బ్రిటిష్ పాలన నుంచి బయటపడ్డాయి. ఈ ప్రక్రియ ఒకే రోజులో జరగలేదు. దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఈ డీకలనైజేషన్ చరిత్రే నేటి ప్రపంచ రాజకీయ పటాన్ని రూపొందించింది. ఈ జాబితాను చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా 1776లోనే బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అది బ్రిటిష్ సామ్రాజ్యానికి వచ్చిన మొదటి పెద్ద దెబ్బ. అయితే అసలు పెద్ద మార్పు మాత్రం 20వ శతాబ్దంలోనే మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం బ్రిటన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడేలా చేశాయి. అదే సమయంలో కాలనీల్లో జాతీయ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ రెండూ కలిసి సామ్రాజ్య పతనానికి దారి తీశాయి.

1947లో మన దేశం విముక్తి..

ఆసియాలో చూస్తే, భారత్‌ 1947లో స్వాతంత్ర్యం పొందడం చరిత్రలో కీలక ఘట్టం. భారత్‌తో పాటు అదే ఏడాది పాకిస్తాన్ కూడా బ్రిటిష్ పాలన నుంచి బయటపడింది. ఆ తర్వాత శ్రీలంక (1948), మయన్మార్ (1948), మలయా (1957), మాల్దీవులు (1965), బ్రూనై (1984) లాంటి దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఆసియా, ఆఫ్రికా దేశాలకు అది ఒక ప్రేరణగా మారిందన్న వాదన విస్తృతంగా వినిపిస్తుంది.

ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ పాలన ప్రభావం చాలా లోతుగా ఉంది. ఘానా 1957లో స్వాతంత్ర్యం పొందడం ద్వారా ఆఫ్రికాలో తొలి బ్రిటిష్ కాలనీగా విముక్తి సాధించింది. దాని తర్వాత నైజీరియా (1960), సియెర్రా లియోన్ (1961), ఉగాండా (1962), కెన్యా (1963), జాంబియా (1964), మాలావి (1964), బోట్స్వానా (1966), లెసోథో (1966), స్వాజిలాండ్‌/ఈస్వాటిని (1968), జింబాబ్వే (1980) వంటి దేశాలు వరుసగా స్వాతంత్ర్యాన్ని అందుకున్నాయి. ఈ దేశాల స్వాతంత్ర్య పోరాటాలు చాలా చోట్ల రక్తపాతంతో కూడుకున్నవే. కొన్ని దేశాల్లో శాంతియుత చర్చల ద్వారా మార్పు జరిగితే, మరికొన్ని చోట్ల సాయుధ పోరాటాలు తప్పలేదు.

మధ్యప్రాచ్య ప్రాంతంలో బ్రిటన్ పాత్ర కొంత భిన్నంగా ఉంది. ఇరాక్ (1932), జోర్డాన్ (1946), ఇజ్రాయెల్ (1948), కువైట్ (1961), ఖతర్ (1971), బహ్రెయిన్ (1971), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (1971), ఒమన్ (1970) లాంటి దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. ఇక్కడ బ్రిటిష్ పాలన ఎక్కువగా మాండేట్ లేదా ప్రొటెక్టరేట్ రూపంలో కొనసాగింది. ఈ ప్రాంతంలో గీసిన సరిహద్దులు ఇప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతుండటం గమనార్హం.

కరేబియన్ దీవులు, పసిఫిక్ దేశాల స్వాతంత్ర్య కథ మరింత ఆలస్యంగా సాగింది. జమైకా (1962), ట్రినిడాడ్ అండ్ టొబాగో (1962), బార్బడోస్ (1966), బహామాస్ (1973), గ్రెనడా (1974), సెయింట్ లూసియా (1979), సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ (1979), అంటిగ్వా అండ్ బార్బుడా (1981), సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ (1983) లాంటి దేశాలు క్రమంగా స్వాతంత్ర్యాన్ని సాధించాయి. అలాగే పసిఫిక్ ప్రాంతంలో ఫిజీ (1970), టువాలు (1978), కిరిబాటి (1979), వనాటు (1980) వంటి చిన్న దేశాలు కూడా బ్రిటిష్ పాలన నుంచి బయటపడ్డాయి.

మెల్లి మెల్లిగా పతనమైన బ్రిటీష్ రాజరిక పాలన..

ఈ మొత్తం జాబితా ఒక విషయాన్ని బలంగా చెబుతోంది. బ్రిటిష్ సామ్రాజ్యం పతనం ఒక్కసారిగా జరగలేదు.. అది దశాబ్దాల పాటు సాగిన రాజకీయ, సామాజిక మార్పుల ఫలితం. స్వాతంత్ర్యం వచ్చినా చాలా దేశాలు ఇప్పటికీ బ్రిటిష్ కాలం వారసత్వంతోనే జీవిస్తున్నాయి – భాష, న్యాయ వ్యవస్థ, పరిపాలనా విధానాలు, సరిహద్దు వివాదాలు అన్నీ దానికి ఉదాహరణలు. స్వాతంత్ర్యం అనేది కేవలం అధికార మార్పు మాత్రమే కాదు. అది ఒక దేశం తన గుర్తింపును తిరిగి పొందే ప్రయాణం. బ్రిటన్ నుంచి విముక్తి పొందిన ఈ దేశాల చరిత్ర చూస్తే, స్వేచ్ఛ ఎంత ఖరీదైనదో, ఎంత కష్టపడి సాధించాల్సి వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో, స్వాతంత్ర్యం తర్వాత నిజమైన అభివృద్ధి, సమానత్వం సాధించడం మరో పెద్ద సవాలేనని ఈ చరిత్ర మనకు గుర్తు చేస్తుంది.




Tags:    

Similar News