మెస్సీ బస చేసే ఫలక్ నుమా ప్యాలెస్ లో రోజుకు రూం ఎంత?
అయితే.. తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ ఎక్కడ బస చేస్తారు? అన్నంతనే వచ్చే సమాధానం పాతబస్తీలోని తాజ్ గ్రూప్ కు చెందిన ఫలక్ నుమా ప్యాలెస్ అన్న సమాధానం వస్తుంది.;
మన పక్కనే ఉండే చాలా విషయాలకు సంబంధించిన చరిత్ర మీద అవగాహన ఉండదు. మిగిలిన దేశస్తులతో పోలిస్తే.. భారతీయులకు చరిత్ర మీద ఆసక్తి పెద్దగా కనిపించదు. దాని లోతుల్లోకి వెళ్లి.. విషయాల్ని.. వివరాల్ని సేకరించే విషయంలో వారు వెనుకబడి ఉంటారనే చెప్పాలి. తాజాగా ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ ఈ రోజు హైదరాబాద్ మహానగరానికి రానున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకునే ఆయన.. ఈ రోజు (శనివారం) రాత్రి ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారన్న విషయం కూడా పాతదే.
అయితే.. తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ ఎక్కడ బస చేస్తారు? అన్నంతనే వచ్చే సమాధానం పాతబస్తీలోని తాజ్ గ్రూప్ కు చెందిన ఫలక్ నుమా ప్యాలెస్ అన్న సమాధానం వస్తుంది. విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రముఖులు.. సెలబ్రిటీలు తరచూ బస చేసే ఫలక్ నుమా ప్యాలెస్ అందాలకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. ఈ సందర్భంగా ఫలక్ నుమా ప్యాలెస్ ఎవరు నిర్మించారంటే.. మరో ఆలోచన లేకుండా నిజాం రాజులు అన్న సమాధానం వస్తుంది. కానీ.. అందులో నిజం లేదు. అసలు జరిగింది వేరు.
అదే సమయంలో సామాన్యులు ఎవరైనా అక్కడ బస చేయాలన్నా.. లంచ్ కానీ డిన్నర్ కానీ.. బ్రేక్ ఫాస్ట్ కానీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న విషయాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. చార్మినార్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఫలక్ నుమా ప్యాలెస్ మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక కొండ మీద ఉండే ఈ ప్యాలెస్ ను 1893లో నిర్మించారు. ఇంతకూ ఇంత భారీ ప్యాలెస్ ను కట్టించింది నిజాం ప్రభువు కాదు. హైదరాబాద్ సంస్థానానికి ప్రధానమంత్రిగా వ్యవహరించిన వికార్ ఉల్ ఉమ్రా తన అభిరుచికి తగ్గట్లు కట్టుకున్నారు. తన వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే రూ.40 లక్షలు ఖర్చు చేశారు.
ఇందుకోసం బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకున్నారు. నిజానికి ఈ ప్యాలెస్ కారణంగా సదరు ప్రధాని ఉమ్రా దివాలా తీశారని చెప్పాలి. 1897లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ ప్యాలెస్ ను సందర్శించి.. దాని వైభవాన్ని చూసి ముగ్దులయ్యాడు. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్న రాజుల్లో నిజాం ఒకరన్న సంగతి తెలిసిందే. నిజాం ప్రభువు తన ప్యాలెస్ ను చూసి మనసు పడిన నేపత్యంలో.. ఆయనకు దాన్ని నజర్ (బహుమతిగా) ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అయితే.. ఈ సందర్భంగా నిజాం దాని విలువలో కొంత భాగాన్ని చెల్లించి ప్యాలెస్ ను తన స్వాధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్యాలెస్ నిజాం రాజ కుటుంబానికి రాజ అతిథి గ్రహంగా మారింది. కాలక్రమంలో దీని అలనాపాలనా చూసుకునే విషయంలో నిజాం రాజ కుటుంబీకులు పెద్దగా ఫోకస్ చేయలేదు. ఈ నేపథ్యంలో దీన్ని 2010లో తాజ్ గ్రూప్ నిజాం కుటుంబం నుంచి 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఏడాదికి రూ. కోటి చొప్పున లీజు చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఆర్థిక లావాదేవీల వివరాలు పెద్దగా బయటకు రాలేదు.
అయితే.. లీజు ఒప్పందంలో భాగంగా ప్యాలెస్ ను భారీ ఎత్తున పునరుద్ధరణ చేపట్టారు. ఇందుకోసం పదేళ్ల సమయం పట్టింది. అలా 2010లో దీన్ని హోటల్ రూపంలోకి పూర్తిగా మార్చారు. పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చు తాజ్ గ్రూపు చెల్లించిందని చెబుతారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ నిజాం మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రాకు చెందుతుందన్న మాట వినిపిస్తుంటుంది. హైదరాబాద్ మహానగరానికి వచ్చే అత్యంత ప్రముఖులకు ఫలక్ నుమా ప్యాలెస్ లో అతిధ్యం ఇవ్వటం.. దాని సౌందర్యానికి వారు ఫిదా కావటం తెలిసిందే.
ఈ మధ్యన నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు.. అంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమిట్ కు అప్పట్లో ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తో పాటు పలువురు ప్రముఖులకు 2017లో అతిధ్యం ఇందులోనే ఇచ్చారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సోదరి పెళ్లిని ఇందులోనే అంగరంగ వైభవంగా నిర్వహించటం తెలిసిందే.
ఇవన్నీ సరే.. సామాన్యులు ఇందులో బస చేయాలన్న జీవితకాల కోరికను తీర్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో భోజనం చేయాలంటే అయ్యే ఖర్చు మాటేమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. రోజుకు కనిష్టంగా రూ.25వేలు.. గరిష్ఠంగా రూ.8లక్షల వరకు ఉంటుందని చెబుతారు. సరాసరిన రోజున రూ.40 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రీ లెవల్ గదులకు రూ.25-40 వేల వరకు.. సూట్ రూంలు లేదంటే ప్యాలెస్ సూట్ లాంటి లగ్జరీ సూట్ ధర మాత్రం ఒక రాత్రికి రూ.1లక్ష నుంచి రూ.8 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని చెబుతారు.
ఫలక్ నుమా ప్యాలస్ లో మొత్తం రూంలు కానీ సూట్ రూంలతో కలిపి 60 వరకు ఉన్నాయి. ఇందులో మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అదా రెస్టారెంట్ లో భోజనం కోసం రూ.7500 నుంచి రూ.8500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే గోల్ బంగ్లా రెస్టారెంట్ లో అయితే డిన్నర్ కు ఒక్కొక్కరికి రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక.. సెలెస్ట్ రెస్టారెంట్ లో ఇటాలియన్ ఫుడ్ ఫేమస్. ఇదే కాక కాంటినెంటల్ మెనూ కూడా ఉంటుంది. ఇందులో ఒకరి భోజనానికి అయ్యే ఖర్చు దగ్గర దగ్గర రూ.8వేల వరకు ఉంటుంది. ఇక.. హై టీ కూడా ఖరీదైన వ్యవహారమే. ఒక్కొక్కరికి హోటల్ వారు రూ.7వేల వరకు ఛార్జ్ చేస్తారని చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు.. ఈ ప్యాలెస్ లో బస చేసిన క్రమంలో.. ప్యాలెస్ మొత్తం చుట్టేస్తామంటే కుదరదు. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అనుమతించరు.