ఏపీలో మొదలైన పంచాయతీ హడావుడి.. ఎన్నికల తేదీ ఫిక్స్!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.;
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్ ముగిసింది. మరో రెండు విడతల్లో పంచాయతీలకు ఈ నెలలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రహసనం ముగిసిన వెంటనే ఏపీలోనూ పంచాయతీ ఫైటింగ్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పంచాయతీ పాలకవర్గాలకు గడువు ఉన్నప్పటికీ, మూడు నెలల ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సెప్టెంబరు నుంచి ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ పోరుకు సిద్ధం అవుతోందని చెబుతున్నారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు స్పష్టమైన సూచనలు చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో జనగణన ఉండటంతో ముందుగానే పంచాయితీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిందని చెబుతున్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారని సమాచారం. ఇక ఎన్నికలు ఈవీఎం విధానంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సివుంది. ఇప్పటివరకు పంచాయతీ, స్థానిక ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి నాలుగు విడతల్లో ఈవీఎంల రూపంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని అంటున్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రక్రియలను పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించాల్సివుందని అంటున్నారు. ఏప్రిల్ వరకు పంచాయతీలకు గడువు ఉన్నప్పటికీ జనవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో పండగ ఉండటంతో ఆ నెలలో 20వ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ఆ సమయంలో ఎండలు తక్కువగా ఉండటం, పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టే ఎన్నికల కమిషన్ సైతం ఆ కాలంలోనే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక షెడ్యూల్ కు ముందు కొన్ని పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్రగ్రేడ్ చేసే అవకాశాలను ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ నెలలో పంచాయతీలను విభజించి పాత పంచాయతీలతోపాటే వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే తక్కువ సమయం ఉండటం వల్ల కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎన్నికల కమిషన్ హడావుడి చూస్తుంటే వచ్చే నెలలో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైనట్లే అంటున్నారు.