మొన్న చంద్రబాబు.. నేడు కన్నా.. అరెస్ట్ తప్పదా?

Update: 2019-09-16 06:20 GMT
ఏపీలో జగన్ సర్కారుపై పోరుబాటకు బీజేపీ రెడీ అయ్యింది. వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనలో వైఫల్యాలను వెల్లడించేందుకు బీజేపీ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.. సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సమాయత్తమైంది. సోమవారం ఉదయం గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఈ సభకు హాజరు కావడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బయలు దేరారు.

అయితే బీజేపీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. గురజాలలో సభకు అనుమతి లేదని.. 144 సెక్షన్ అమల్లోకి ఉందని పోలీసులు కన్నాకు తెలిపారు.

అయితే కన్నా పోలీసుల నోటీసులు తీసుకోలేదు. వెంటనే గురజాలకు బయలుదేరారు. పోలీసులు ప్రస్తుతం కన్నా కాన్వాయిని వెంబడిస్తున్నారు. మార్గమధ్యంలోనే కన్నాను అదుపులోకి తసీుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

మొన్న ‘చలో ఆత్మకూరు’ పేరుతో చంద్రబాబు తలపెట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని జగన్ సర్కారు పోలీసులతో అరెస్ట్ లు చేయించి నిర్బంధించింది. నేడు బీజేపీ కూడా జగన్ 100 రోజుల పాలనపై సభకు కూడా ఆటంకాలు కల్పిస్తోంది. మూడునెలలు కూడా కాకముందే జగన్ సర్కారుపై పోరాడుతున్న చంద్రబాబు, కన్నాలపై జగన్ గట్టిగా ప్రతిస్పందిస్తున్నారు..
Tags:    

Similar News