నితీశ్ అంటే అంతే మరి!

Update: 2017-07-28 00:30 GMT
ఇదే మరొక రాష్ట్రంలో మరొక ముఖ్యమంత్రి ఇదే పనిచేసి ఉంటే గనుక.. విమర్శలు హోరెత్తి పోయి ఉండేవి. అవకాశవాద ముఖ్యమంత్రి - రాజకీయాలను వ్యాపారం చేసేస్తున్నారు.. తన అవసరానికి అందరినీ వాడుకుని అవసరం తీరగానే వదిలేస్తారని.. ఇలా ఆయనను అంతా దుమ్మెత్తిపోసి ఉండేవాళ్లు. కానీ రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి.. ప్రభుత్వాన్ని తన చేతుల్తో కూల్చేసి.. తెల్లారేసరికెల్లా.. శత్రుపక్షం వారిని సరసన కూర్చోబెట్టుకుంటూ తాను మళ్లీ అధికార పీఠం అధిరోహించడం అంటే.. ఎక్కడైనా విమర్శలు తప్ప మరోటి ఉండదు. అయితే.. బీహార్ లో అచ్చంగా ఇలా జరిగిన రాజకీయ పరిణామాల గురించి ఎవ్వరూ పల్లెత్తు మాట అనడం లేదు. ఎందుకని? అదే మరి.. నితీశ్ కుమార్ అంటే!

నితీశ్ కుమార్ సమకాలీన రాజకీయాల్లో - వీసమెత్తు అవినీతి మచ్చలేని నికార్సయిన ప్రజాసేవకుడు. ‘ఆయన అధికారం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు’ అంటూ రాహుల్ లాంటి వాళ్లు తమ బాధను - అక్కసును వెళ్లగక్కి ఉండవవచ్చు గాక...! బీహార్లో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించలేని అలాంటి నాయకులు కూడా... నితీశ్ అధికారం కోసం వెంపర్లాడుతున్నారని అంటున్నారే తప్ప.. అవినీతి ఆరోపణ ఏదైనా చెప్పడానికి సాహసించడం లేదు.

నితీశ్ కుమార్ కు ఉన్న క్రెడిబిలిటీ అది. ఆయన సదా సంకీర్ణ ప్రభుత్వాలనే నడపడానికి అయినా సిద్ధం. రాష్ట్రవ్యాప్తంగా తనకు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టేలా ప్రజలు ఆదరించకపోయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరు మద్దతిస్తే వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తారు. నాయకత్వ స్థానంలో తాను ఉన్నప్పుడు.. తన కింద ఉన్న వాళ్లు ఎలాంటి తప్పులు చేయకుండా తాను చూసుకోగలనన్న ధీమా ఆయనది. పైగా తాను నీతిమంతంగా ఉంటున్నప్పుడు, స్వచ్ఛమైన పాలన అందిస్తున్నప్పుడు.. దానిని ప్రజలు గుర్తిస్తే చాలు.. ఎవరేం విమర్శలు చేసినా నాకు ఖాతరు లేదు.. అని వ్యవహరించగల ధీమా ఆయనది.

సీఎం స్థాయిలో ఒక నాయకుడు హండ్రెడ్ పర్సంట్ నిజాయితీ పరుడైతే.. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. మాటలు మార్చినా.. ఎన్నికల వేళలో  శత్రువుల కింద తిట్టిన వారినే.. తిరిగి అక్కున చేర్చుకున్నా ప్రజలు మారు మాటాడకుండా ఉండడానికి ఆ ఒక్క కారణం చాలు! తాను ప్రజలకు తప్ప మరెవ్వరికీ జవాబుదారీ వహించక్కర్లేదని ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుపోయేవారు... అలాంటి సీఎంలు మనకింకా ఎవరున్నారు? అందుకే.. నితీశ్ అంటే అంతే మరి!!
Tags:    

Similar News