నిమ్మగడ్డ బాధేమిటో అర్ధం కావటంలేదే ?

Update: 2020-12-12 05:02 GMT
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధేమిటో అర్ధం కావటంలేదు. మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలంటు తాజాగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితో పాటు పంచాయితీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాయటం ఆశ్చర్యంగా ఉంది. చీఫ్ సెక్రటరీకి కానీ ముఖ్యకార్యదర్శులకు కానీ ఎన్ని లేఖలు రాసినా ఉపయోగం ఉండదని నిమ్మగడ్డకు బాగా తెలుసు. తెలిసి కూడా వాళ్ళకు లేఖలు రాయటంలో ఏమిటర్ధం ?

ఒకవైపు ప్రభుత్వంతో గొడవలు పడుతునే మరోవైపు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయటం నిమ్మగడ్డకే చెల్లింది. ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి మాత్రమే అన్న విషయం నిమ్మగడ్డకు కూడా బాగా తెలుసు. సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అవటం తప్ప మిగిలిన యంత్రాంగానికి వేరేదారిలేదు. చీఫ్ సెక్రటరీ అయినా ప్రిన్సిపుల్ సెక్రటరీ అయినా సీఎం చెప్పినట్లు వినాల్సిందే.

కాబట్టి స్ధానిక సంస్ధల ఎన్నికలను జరపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకునేంత వరకు అధికారయంత్రాంగం ఏమీ చేయలేదు. అధికారయంత్రాంగం సహకరించకపోతే ఎలక్షన్ కమీషన్ ఎన్నికల నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మాత్రమే అన్నట్లు ఎలక్షన్ కమీషన్ అంటే కమీషన్ అని మాత్రమే అర్ధం. అంతేకానీ కమీషనర్ కాదు. ప్రభుత్వం మీద ఎలక్షన్ కమీషన్ ఆధారపడుంటుందే కానీ కమీషన్ మీద ప్రభుత్వం ఎప్పుడూ ఆధారపడదు.
Read more!

ఎలక్షన్ కమీషనర్ గా ఉన్న వ్యక్తి ప్రభుత్వ విశ్వాసం ఉన్నంత వరకే వ్యవహారం సజావుగా సాగుతుంది. లేకపోతే ఇఫుడు ప్రభుత్వం-నిమ్మగడ్డకు మధ్య గొడవలు జరుగుతున్నట్లే జరుగుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ ఎన్నిసార్లు కోర్టుకెళ్ళినా ఎన్నికలనైతే జరిపించలేరన్నది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే కోర్టులు కూడా ఏమీ చేయలేవు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పేసిన తర్వాత కోర్టు కూడా బలవంతంగా ఎన్నికలు జరిపేంచే అవకాశం లేదు. ఈ విషయాలు తెలిసీ నిమ్మగడ్డ కావాలనే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.

ప్రజల, అధికారయంత్రాంగం ప్రాణాలను పణంగా పెట్టైనా ఎన్నికలు జరపాల్సిందే అని కోర్టు ఎలా చెబుతుంది ? జరుగుతున్న ఎన్నికలను ప్రభుత్వంతో చర్చించకుండానే ఏకపక్షంగా నిమ్మగడ్డ ప్రకటించకుండా ఉండుంటే ఇపుడీ సమస్యలేవీ ఉండేవి కావు. 24 గంటలూ ప్రభుత్వంతోనే పనులున్నపుడు అదే ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే సహకారం ఎలా ఉంటుందని నిమ్మగడ్డ అనుకున్నారో అర్ధం కావటంలేదు. ఎన్నికల కమీషన్ రాజ్యాంగబద్దమైన సంస్ధ అని, ఎన్నికల నిర్వహణ పూర్తిగా కమీషన్ అధికారమే అని ఇపుడు చెబుతున్న నిమ్మగడ్డ మరి టీడీపీ హయాంలో ఇదే వాదన ఎందుకు చేయలేదు ? అప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు ?
Tags:    

Similar News