టీడీపీ మాజీ మంత్రికి చెక్ చెప్పేస్తున్నారా...?

Update: 2023-01-10 23:30 GMT
ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. కాంగ్రెస్ రాజకీయాల్లో బాగా రాణించి మంత్రిగా పనిచేసిన వారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు వైఎస్సార్ అనుంగు అనుచరుడిగా రాజకీయాలను చాలా కాలం పాటు శాసించారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటువంటి ఆయనకు రాష్ట్ర విభజన వల్ల పార్టీ మారక తప్పింది కాదు.  2014లో  తెలుగుదేశంలో చేరితే టికెట్ దక్కలేదు.

ఇక మూడేళ్ళ తరువాత  ఆయనకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో శత్రుచర్ల ఫ్యామిలీ పలుకుబడిని వాడుకుందామనుకుంటే అక్కడ వైసీపీ జెండావే ఎపుడూ ఎగురుతూ వస్తోంది.  కురుపాంలలో వైసీపీ వరసబెట్టి గెలుస్తూ వస్తోంది. దాంతో ఈ సీనియర్ నేతకు తెలుగుదేశం ఇపుడు ప్రాధాన్యతను తగ్గించేస్తోంది అని అంటున్నారు.

శత్రుచర్ల మరోమారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో సేఫ్ ప్లేస్ చూసుకుని పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం కొత్త తరం నాయకుల వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల బాబు విజయనగరం జిల్లా టూర్ లో సైతం శత్రుచర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటున్నారు.

ఆయన తమ్ముడు కుమార్తెగా ఉన్న పల్లవీరాజ్ కి కురుపాం టికెట్ కోసం ప్రయత్నం చేసినా బాబు నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. శత్రుచర్ల పలుకుబడి బాగా తగ్గిపోవడం వరసబెట్టి తెలుగుదేశానికి ఓటములే ఎదురుకావడంతో బాబు సైతం యువ నాయకత్వం వైపు చూస్తున్నారు అని అంటున్నారు. కురుపాం, పార్వతీపురంలలో వైసీపీ బలంగా ఉంది. దాంతో ధీటైన అభ్యర్ధులను అన్వేషిస్తున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూస్తే శత్రుచర్ల ఆశలకు తెలుగుదేశం అధినాయకత్వం దాదాపుగా చెక్ చెప్పేసింది అని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా తన తమ్ముడు కూతురుకు టికెట్ దక్కించుకోవాలనుకున్నా పార్టీ మారడమే మార్గమా అన్న చర్చ నడుస్తోంది. వైసీపీలోకి శత్రుచర్ల ఫ్యామిలీ రావచ్చు అని గతంలో ప్రచారం సాగింది.

మరి ఇపుడు చూస్తే అదే నిజం అవుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గతంలో మాదిరిగా వ్యవహరించడంలేదు, మొహమాటాలకు అసలు పోవడం లేదు అని అంటున్నారు. ఆయన కనుక తలచుకుంటే పాత నీరుని పక్కన పెట్టేసి తనదైన శైలిలో గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తారని అంటున్నారు. మొత్తానికి సొంత పార్టీలో ప్రత్యర్ధులతో పాటు శత్రువులు శత్రుచర్లకు పెరిగారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News