కేసీఆర్ ఓపిక‌ను పరీక్షిస్తున్న మోడీజీ!

Update: 2017-09-29 01:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓపిక‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌రీక్షిస్తున్నారా?  తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మైన‌ప్ప‌టికీ సీఎం కేసీఆర్ ఆహ్వానం విష‌యంలో మాత్రం మోడీజీ గ్రీన్ సిగ్న‌ల్‌ ఇవ్వ‌క‌పోవ‌డం వెనుక మ‌ర్మం ఇదేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ కీర్తికిరీటంలో మ‌రో క‌లికితురాయి ఈ న‌వంబ‌ర్ 28వ తేదీన చేర‌నున్నట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. నగర రవాణా రంగంలో విప్లవాత్మక మలుపుకాగల మెట్రో రైలు తొలి దశ ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుందని ప్ర‌క‌టించిన‌ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం డైల‌మాలో ప‌డిన‌ట్లు స‌మాచారం.

ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించాలని తలచి...కార్యక్రమానికి మోడీని ఆహ్వానిస్తూ 20 రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 6న ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాదు ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా కలిసి మెట్రో రైలును ప్రారంభించాల్సిందిగా కోరారు. అయితే ఇప్పటి వరకు ప్రధాని కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేదని స‌మాచారం. నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు మోడీ హాజరుకానున్నారు. అయితే హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డంపై క్లారిటీ ఇచ్చిన‌ మోడీజీ ఈ టూర్ సంద‌ర్భంగా మెట్రో ప్రారంభం విష‌యంలో మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో నవంబర్‌లో మెట్రోరైలు ప్రారంభించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం డైలామాలో పడిందని అంటున్నారు. అయితే... అధికార పార్టీ వ‌ర్గాలు మాత్రం రిలాక్స్‌గా ఉన్నాయి.

తాము ఆశిస్తున్న ప్రారంబోత్స‌వ షెడ్యూల్‌ కు దాదాపుగా ఇంకా రెండు నెలలు సమయం ఉన్నందున మెట్రో రైలు ప్రారంబోత్సవంపై ఎప్పుడైనా సమాచారం అందే అవకాశముందంటున్నాయి. ఇంతటి కీల‌క కార్య‌క్ర‌మానికి మోడీ దూరంగా ఉండబోర‌ని చెప్తున్నాయి. అయితే దాదాపు 20 రోజుల పాటు స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డాన్ని మాత్రం తాము ఊహించ‌లేద‌ని అంగీక‌రిస్తున్నాయి.
Tags:    

Similar News