రూ. 250 కోట్ల టాయిలెట్.....ఇష్యూ వస్తే?

ఈ చిన్న సమస్య వెనుక ఉన్న భారీ సవాళ్లు, ఆ వ్యూమగాముల పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం..;

Update: 2026-04-06 05:24 GMT

అంతరిక్ష ప్రయాణం అంటేనే ఒక సాహసం. కానీ, భూమికి కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నప్పుడు అత్యంత సామాన్యమైన అవసరానికి ఆటంకం కలిగితే అది ప్రాణసంకటంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టెమిస్ II మిషన్‌లో సరిగ్గా ఇదే జరిగింది. రూ. 250 కోట్ల విలువైన హైటెక్ టాయిలెట్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చిన్న సమస్య వెనుక ఉన్న భారీ సవాళ్లు, ఆ వ్యూమగాముల పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 250 కోట్ల టాయిలెట్:

అంతరిక్షంలో టాయిలెట్ అంటే మన ఇంట్లో ఉండేలాంటిది కాదు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి, వ్యర్థాలు కిందకు పడవు. అందుకే గాలి పీడనం (సక్షన్) ఆధారంగా పనిచేసే ఒక క్లిష్టమైన యంత్రాంగాన్ని నాసా రూపొందించింది. దీని తయారీకి సుమారు 23 నుంచి 30 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 250 కోట్లు! ఈ టాయిలెట్ వ్యర్థాలను గాలి ద్వారా పీల్చుకుని, వాటిని సురక్షితంగా వేరు చేస్తుంది. ఇంత ఖరీదైన వ్యవస్థలో లోపం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గడ్డకట్టిన పైపు.. అంతుచిక్కని కాలిన వాసన:

ఆర్టెమిస్ II నౌకలో తలెత్తిన సమస్యపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మూత్ర విసర్జనకు ఉపయోగించే పైపు గడ్డకట్టిపోయిందని భూమిపై ఉన్న శాస్త్రవేత్తలు భావిస్తుంటే, లోపల ఉన్న వ్యోమగాములు మాత్రం మరో రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపు లోపలి భాగం నుంచి కాలిన వాసన వస్తోందని వారు చెబుతున్నారు. అంతరిక్షంలో చిన్న లీకేజీ జరిగినా, వ్యర్థాలు గాలిలో తేలుతూ యంత్రాలకు లేదా వ్యోమగాముల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉంటుంది. ఇక అందుకే ఈ సమస్యను పరిష్కరించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.

కీలక ఘట్టంలో ఆటంకం.. :

సరిగ్గా ఏప్రిల్ 6న ఆర్టెమిస్ II చంద్రుడి చుట్టూ 'ఫ్లైబై' చేయాల్సి ఉంది. ఇది ఈ మిషన్‌లో అత్యంత కీలకమైన సమయం. ఇలాంటి తరుణంలో ఈ టాయిలెట్ సమస్య తలెత్తడం చర్చకు దారితీసింది. అయితే, ఈ లోపం వల్ల మిషన్‌కు పెద్దగా ముప్పు ఏమీ లేదని నాసా శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వ్యోమగాములు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వాటిని అధిగమించిన సందర్భాలు ఉన్నాయి.

మనిషి కేవలం అంతరిక్షంలోకి వెళ్లడమే కాదు, అక్కడ ఎన్ని రోజులు సౌకర్యవంతంగా ఉండగలడనేది ఇప్పుడు ముఖ్యం. మనం భవిష్యత్తులో అంగారక గ్రహం పైకి వెళ్లాలన్నా, చంద్రుడిపై స్థావరాలు నిర్మించుకోవాలన్నా ఆక్సిజన్, ఆహారంతో పాటు ఇటువంటి ప్రాథమిక వసతులు అత్యంత కీలకం. ఇక టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి సిద్ధమైన అవసరాలను తీర్చుకోవడంలో వచ్చే ఇబ్బందులు శాస్త్రవేత్తలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి.

Tags:    

Similar News