గతాన్ని నెమరేసుకున్న దగ్గుబాటి...అదీ ఎన్టీఆర్ ప్రభంజనం !
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రాజకీయాల గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. ఆయన ఎన్టీఆర్ పెద్దల్లుడు.;
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రాజకీయాల గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. ఆయన ఎన్టీఆర్ పెద్దల్లుడు. డాక్టర్ గారూ అని టీడీపీలో ఆయనకు ఒక గౌరవనీయమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు ఆయన వెంట ఉన్నది అనుసరించింది దగ్గుబాటి మాత్రమే. టీడీపీ పునాదులలో ఆయన ఉన్నారు. 1982 మార్చి 29న పార్టీని హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఅర్ ప్రకటించిన తరువాత జిల్లా పర్యటనకు అన్న గారు సిద్ధపడ్డారు. ఆ సమయంలో జూన్ నెల చివరిలో విజయవాడలో ఎన్టీఆర్ పర్యటన ఖరారు అయింది. అలా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి కోస్తాంధ్ర జిల్లాలోని విజయవాడలో పెట్టిన మొదటి ప్రచార ర్యాలీగా నిర్వహించారు.
నాటి ఊరేగింపు అద్భుతం :
ఇక 1982 మే 28న తిరుపతిలో మొదటి మహానాడు జరిగిన తరువాత జిల్లాల పర్యటన చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. అప్పటికి ఇంకా ఎన్ టీఆర్ కి చైతన్య రథం లేదు. అంతే కాదు కారు డ్రైవర్ కి ఒంట్లో బాగులేకపోవడంతో ఎన్ టీఆర్ కారుని దగ్గుబాటి స్వయంగా డ్రైవ్ చేశారు. అలా కోస్తాంధ్రలో జూన్ చివరిలో మొదటి కార్యక్రమం విజయవాడలో జరిగింది. నాటి ఊరేగింపు కార్యక్రమం అద్భుతం అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు ఎయిర్ పోర్టు నుంచి ఎన్టీఆర్ ఆయనతో పాటు దగ్గుబాటి నాదేండ్ల భాస్కరరావు, ఆనాటి విజయవాడకు చెందిన టీడీపీ నేతలు అంతా కలసి విజయవాడ వైపుగా కార్లలో బయలుదేరారు.
కళ్ళలో అదే దృశ్యం :
ఇక ఆనాటి దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని దగ్గుబాటి పేర్కొన్నారు. కృష్ణా నది జలాలు, అక్కడ నుండి అన్ని రోడ్లు జన సందోహంతో క్రిక్కిరిసి నిండిపోయాయి. తాను కూడా జీవితంలో అంత మందిని ఒకేసారి చూడటం మొదటిసారి అని దగ్గుబాటి చెప్పారు. ఆ జనాలను చూసి తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తాను ఆ రోజే డిసైడ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ రోజున శుభ సూచకంగా కొంచెం చిరుజల్లులు కూడా పడటం తనకు గుర్తు అన్నారు.
ఎటు చూసినా జన సందోహం :
ఆ సమయంలో ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. ఎన్టీఆర్ తమ విజయవాడకు వస్తున్నారు అని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న అభిమానులు అంతా కలసి ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చారు. అంతే కాదు జన సామాన్యం అంతా కూడా బారులు తీరింది. దాంతో ఎన్టీఆర్ కి విజయవాడలోకి ఎంటర్ కాకుండానే భారీ స్వాగతం లభించింది. ఇదంతా ఎవరో ఏర్పాటు చేసింది కాదు, ఎవరో జనాలను తీసుకుని వచ్చింది కాదు అప్పటికపుడు అలా వందలు వేలుగా జనాలు తరలి వచ్చి ఎన్టీఆర్ కి ఎదురేగి స్వాగతం పలకడం గ్రేట్ అంటూ ఫేస్ బుక్ లో తాజాగా నాటి ఫోటోలను విషయాలను దగ్గుబాటి పంచుకున్నారు అలా ఆ రోజు రామారావు గారు దుర్గగుడి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు. అక్కడ భారీ సభ జరిగింది. ఇక ఆ మరుసటి రోజు ఏలూరులో ఎన్టీఆర్ సభ నిర్వహించారు. అక్కడ కూడా జనాలు పోటెత్తారు
చైతన్య రధం అలా :
ఇక ఎన్టీఆర్ సభలకు వస్తున్న జనాలు తండోప తండాలుగా ఉండడంతో పాటు ఎవరికీ అదుపు చేయలేని పరిస్థితి. ఈ విధంగా ఎన్టీఆర్ ర్యాలీలలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక చైతన్య రథం కావాలని అనుకున్నామని దగ్గుబాటి చెప్పారు. అందుకోసం అన్న గారి జెమినీ స్టూడియో నుండి కొన్న పాత వస్తువులు, సామానులలో ఒక వ్యాన్ ని చూశారు ఆ వ్యానును బయటకు తీసి దుమ్ము దులిపి మద్రాసు నుండి ఎలన్ అనే ఒక పేరు పొందిన మెకానిక్ ను పిలిపించి చైతన్య రథం తయారు చేయాలని ఎన్టీఆర్ పురమాయించారట. అలా చైతన్య రధం తయారైంది. ఏపీలో అన్న గారి టూర్లలో ఊపేసింది.
బ్యాక్ బోన్ గా :
వాస్తవం చెప్పాలీ అంటే టీడీపీకి బ్యాక్ బోన్ గా దగ్గుబాటి తొలి రోజులలో పనిచేశారు. ఒక ఊరిలో ఎన్ టీఆర్ సభ జరుగుతూంటే మరో ఊరికి దగ్గుబాటి బృందం వెళ్ళి అక్కడ అన్న గారి సభకు తగిన ఏర్పాట్లు చూసేది. ఊరి జనాలు అందరూ సమావేశానికి వచ్చేలా సాఫీగా సభ జరిగేలా ఏర్పాట్లు చేసేది. అలా తొమ్మిది నెలలు ఎన్టీఆర్ చైతన్య రధం మీద పర్యటిస్తే ఆయన కంటే అడుగు ముందు దగ్గుబాటి టీం ఉంటూ ప్రతీ ఊరిలో ప్రతీ చోటా అన్న గారి సభలకు తగిన ఏర్పాట్లు చేసి సూపర్ సక్సెస్ చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఎమ్మెల్యేగానే పోటీ :
ఇక టీడీపీ ఎన్నికలకు సమాయత్తమైన వేళ 1983లో దగ్గుబాటి తొలిసారి తన సొంత జిల్లా ప్రకాశంలోని పర్చూరు నుంచి పోటీ చేశారు. అయితే ఆ పోటీ ఎన్టీఆర్ ఒత్తిడితోనే జరిగింది అని చెబుతారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దగ్గుబాటి మంత్రి పదవిని తీసుకోలేదు. 1985లో మాత్రం ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలా 1988 దాకా నాలుగేళ్ళ పాటు పనిచేశారు. తిరిగి మళ్ళీ దగ్గుబాటి మంత్రి పదవిని ఎక్కడా చేయలేదు.