పార్లమెంటుకు.. తెలంగాణ-ఏపీల మధ్య 'ఐదు గ్రామాల' రగడ!
ఏపీ-తెలంగాణల మధ్య జల వివాదాలు కొత్త కాదు. పోలవరం నుంచి గోదావరి ప్రాజెక్టుల వరకు.. నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల దాకా.. పలు వివాదాలు కొనసాగుతున్నాయి.;
ఏపీ-తెలంగాణల మధ్య జల వివాదాలు కొత్త కాదు. పోలవరం నుంచి గోదావరి ప్రాజెక్టుల వరకు.. నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల దాకా.. పలు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక, ఉమ్మడి ఆస్తుల విభజన అంశంకూడా ఇరు రాష్ట్రాల మధ్యసెగ పుట్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను తెలంగాణ సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం.. మరో కొత్త వివాదానికి దారితీసింది. ఇక, తాజాగా ఖమ్మం జిల్లా భద్రాచలానికి సమీపంలో ఉన్న ఐదు గ్రామాలను తమకు ఇచ్చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. బ్యాక్ వాటర్ ద్వారా కొన్ని మండలాలు ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి అభ్యంతరం వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2014లోనే అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి.. ముంపు మండలాలను ఏపీలో విలీనంచేయించారు. ఇలా.. ఏడు మండలాలు విలీనం అయ్యాయి. అయితే.. వీటిలో భద్రాచలానికి సమీపంలో ఉన్న ఐదు గ్రామాలను తమకు తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. కానీ.. ఇప్పుడున్నంత సీరియస్‌గా అయితే కాదు.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఐదు గ్రామాలను తమకు ఇచ్చేయాలనిపట్టుబడుతూ.. కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తోంది. తాజాగా మరోసారి తెలంగాణ మంత్రి, అదే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. అయితే.. దీనికి పార్లమెంటులో సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. ప్రస్తుతం జరుగుతున్న బడ్జట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పెట్టి ఆమోదించాలని ఆయన అభ్యర్థించారు. దీంతో మరోసారి ఈ వివాదం తెరమీదికి వచ్చింది.
ఏంటా గ్రామాలు..?
భద్రాచటానికి సమీపంలో 5 గ్రామాలు ఉన్నాయి. అవి.. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల. ఇవి పోలవరం బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురవుతాయి. ఈనేపథ్యంలో వీటిని 2014లోనే పార్లమెంటు ప్రత్యేక బిల్లు తెచ్చి ఏపీలో కలిపింది. కానీ, ఆతర్వాత.. వీటిని తెలంగాణలో కలపాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఈ గ్రామాలను తమకు ఇస్తేనే భద్రాచలం ఆలయ అభివృద్ధి, ప్రజలకు సేవలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. పరిపాలనా సౌలభ్యం, గిరిజనుల ప్రయోజనాల కోసం ఈ మార్పు అవసరమని చెబుతోంది. కానీ.. ఏపీ దీనిని వ్యతిరేకిస్తోంది.
తెలంగాణ వాదన ప్రకారం.. ఈ 5 గ్రామాలు భద్రాచలానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన వందల ఎకరాల భూములు, ఆస్తులు, డంపింగ్ యార్డ్ ఈ గ్రామాల్లోనే ఉన్నాయి. కాబట్టి తమకు ఇచ్చేస్తే.. ఇక్కడ డెవలప్ చేసుకుంటామని చెబుతోంది. కానీ.. ఇప్పటికే వీటిని ఏపీలో విలీనం చేసిన నేపథ్యంలో తిరిగి ఇచ్చేందుకు ఏపీ నిరాకరిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం పార్లమెంటుకు చేరిన నేపథ్యంలో ఏపీ ఏవిధంగా వ్యవహరిస్తుందన్నది చూడాలి.