అడవిలో చిక్కుకొని నాలుగు రోజుల తర్వాత.. అధికారులు ఊహించని షాక్..

ఏప్రిల్ 2న ట్రెక్కర్ల బృందంతో కలిసి వెళ్లిన 36 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ శరణ్య, దారి తప్పి అడవిలో చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.;

Update: 2026-04-06 05:08 GMT

భూమిపై అడవి, ఎడారి, సముద్రంలో చిక్కుకుపోవడం సాధారణ విషయం కాదు.. ప్రాణాలు నిలుస్తాయని చెప్పడం దాదాపు అసాధ్యం. అలాంటి అడవిలో చిక్కుకున్న ఒక యువతి దట్టమైన కోడగు అడవుల్లో నాలుగు రోజుల పాటు ఒంటరిగా చిక్కుకుపోయి, ప్రాణాలతో తిరిగి రావడం అంటే అది ఆ మహిళా టెక్కీ అసాధారణ మనోధైర్యానికి నిదర్శనం. ఏప్రిల్ 2న ట్రెక్కర్ల బృందంతో కలిసి వెళ్లిన 36 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ శరణ్య, దారి తప్పి అడవిలో చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఆమె సురక్షితంగా దొరకడం అందరికీ పెద్ద ఊరటనిచ్చింది. ఈ సాహసోపేతమైన ప్రయాణం ఎలా మొదలైంది.. ఎలా ముగిసిందో క్లుప్తంగా తెలుసుకుందాం..

నలుగు రోజులు అడవిలో..

దట్టమైన అడవిలో క్రూర మృగాల భయం ఉన్నప్పటికీ, శరణ్య తన ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. అడవిలో దొరికిన సహజ నీటి ప్రవాహాల సాయంతో ఆమె తన దాహాన్ని తీర్చుకుంది. ఆహారం లేకపోయినా, నీరు ఉండడం వల్ల ఆమె శక్తిని కోల్పోకుండా నిలబెట్టుకోగలిగింది. ఒంటరిగా ఉన్నా ఏమాత్రం భయపడకుండా, సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఉండడం ఆమెను ప్రాణాలతో నిలబెట్టింది.

శరణ్య కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్

శరణ్యను గుర్తించడానికి కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని అటవీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చేపట్టారు. అటవీ అధికారులు, పోలీసులతో పాటు నక్సల్ వ్యతిరేక బలగాలను కూడా ఈ ఆపరేషన్‌లో రంగంలోకి దింపారు. మొత్తం 150 మందికి పైగా సిబ్బంది దట్టమైన అడవులను జల్లెడ పట్టారు. డ్రోన్లు, స్నిప్పర్ కుక్కలను మోహరించినప్పటికీ, దట్టమైన చెట్ల వల్ల తొలుత ఆమెను గుర్తించడం కష్టమైంది. అడవిపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక గిరిజనుల సహకారం ఈ రెస్క్యూలో కీలకమైంది. ఆదివారం చీకటి పడకముందే వారు శరణ్యను గుర్తించగలిగారు.

తాడియాండమోల్ కొండలు

కోడగు జిల్లాలోని ఎత్తయిన తాడియాండమోల్ శిఖరాన్ని అధిరోహించడానికి ఏప్రిల్ 2న శరణ్య తన బృందంతో బయలుదేరింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకునే క్రమంలో ఆమె తన బృందం నుంచి విడిపోయింది. తిరిగి క్యాంపింగ్ సైట్‌కు వెళ్లే ప్రయత్నంలో తెలియకుండానే అడవిలోకి మరింత లోతుగా వెళ్లింది. ఆమె తిరిగి రాలేదని గుర్తించిన వెంటనే ట్రెక్కర్ల బృందం అధికారులకు సమాచారం అందించడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ వేగంగా మొదలైంది.

శరణ్య ఆరోగ్య పరిస్థితి?

ఆదివారం సాయంత్రం రక్షించిన వెంటనే ఆమెకు ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. నాలుగు రోజుల పాటు సరైన ఆహారం లేకపోవడం, అడవిలో నడవడం వల్ల ఆమె తీవ్ర అలసటకు గురైంది. ప్రస్తుతం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని సమాచారం.

శరణ్య కథ సుఖాంతమైనప్పటికీ, ఇది ట్రెక్కర్లకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతోంది. ఎప్పుడూ బృందాన్ని విడిచి ఒంటరిగా వెళ్లద్దు.. తెలియని మార్గాల్లో వెళ్లి ప్రయోగాలు చేయడం వంటివి అస్సలు చేయద్దు.. అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేప్పుడు కనీస మనుగడ కిట్, సమాచార సాధనాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరి.

Tags:    

Similar News