ట్రంప్ మంగళవారం కబుర్లు--లైట్ తీసుకుంటున్న ఇరాన్

అమెరికా అంటే పెద్దన్న. ప్రపంచ పోలీస్. సూపర్ స్టేటస్ పవర్ ని ఎంజాయ్ చేస్తున్న అగ్ర రాజ్యం.;

Update: 2026-04-06 03:52 GMT

అమెరికా అంటే పెద్దన్న. ప్రపంచ పోలీస్. సూపర్ స్టేటస్ పవర్ ని ఎంజాయ్ చేస్తున్న అగ్ర రాజ్యం. 1990 దశకంలో సోవియట్ రష్యా పతనం అయ్యాక ఏక ధృవ ప్రపంచంగా మారింది. దాంతో అమెరికా పెద్దన్న ఆడిందే ఆట పాడిందే పాట. సంపన్న దేశం. అత్యాధునిక మిలటరీ సామర్థ్యం కలిగిన దేశం ఎన్నో రకాలుగా ఎదిగిన దేశం దాంతో అమెరికా మీదనే ప్రపంచం ఆధారపడడం మొదలైంది. దానిని ఆసరాగా చేసుకుని అమెరికా తన అగ్రాధిపత్యాన్ని బలంగా ప్రదర్శిస్తూ వచ్చింది. అమెరికాకు ప్రెసిడెంట్లుగా ఎవరు ఎన్నిక అయినా వారి ఆలోచనా ధోరణి దాదాపుగా ఒకేలా ఉంటుంది. అమెరికా ఏ విషయంలో పైచేయిగా ఉండాలన్నదే శ్వేత సౌధం ఆశయం. ఆరాటం, తాపత్రయం.

అందరికంటే ఘనుడుగా :

ఇక డొనాల్డ్ ట్రంప్ విషయం తీసుకుంటే అమెరికా ప్రెసిడెంట్లు అందరి కంటే ఘనుడిగా మారాలనుకున్నారు. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఆయన తన విశ్వ రూపమే చూపిస్తూ వచ్చారు. ఈ విధంగా ఆయన కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు ఇదే ఊపులో స్పీడులో ఇరాన్ మీద కూడా పడితే ఒక్క దెబ్బతో ప్రపంచం అంతా షాక్ తినేలా సక్సెస్ ని అందుకోవాలనుకున్నారు. ఇరాన్ ఏ మాత్రం అని అతి ధీమాతో యుద్ధంలోకి దిగిన ట్రంప్ కి ఇపుడు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. దాంతో యుద్ధంలో నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ రోజుకొకటి పూటకొకటి ఇస్తున్న వార్నింగులు కానీ స్టేట్మెంట్స్ కానీ తేలిపోతున్నాయి. ఇరాన్ అయితే వాటిని పూర్తి లైట్ గా తీసుకుంటోంది.

అమెరికాకు భారీ నష్టం :

ఇక ఈ యుద్ధం మొదలై ఆరు వారాలు పూర్తి ఏడవ వారంలోకి అడుగుపెడుతోంది. అయినా సరే ఇరాన్ లొంగడం లేదు, అమెరికాకు తీవ్రమైన నష్టం కలిగిస్తోంది. తన వద్ద ఆయుధ సంపత్తి ఏ మాత్రం తగ్గిపోలేదని గట్టిగా చెబుతోంది. దాంతో ఖంగు తినడం ట్రంప్ వంతు అవుతోంది. యుద్ధం ఏదో విధంగా ముగించాలని ట్రంప్ కి ఉంది. అయితే అది కూడా అమెరికా స్టేటస్ కి ఇబ్బంది కలగకుండా అన్నదే ట్రంప్ ఆలోచన. అయితే ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గుతుంది. దాంతో యుద్ధానికి సై ఎన్నాళ్ళు అయినా రెడీ అంటోంది. ఇదే అమెరికాను కలవరపెడుతోంది. ఎక్కువ కాలం యుద్ధం చేస్తే అమెరికాకు అపారమైన నష్టం కలుగుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఈ యుద్ధంతో ఆర్ధికంగా అమెరికా దెబ్బ తిన్నది అని నివేదికలు చెబుతున్నాయని అంటున్నారు.

ఇరాన్ కౌంటర్ వార్నింగ్ :

ఇక ట్రంప్ ఇపుడు మంగళవారం లోగా హార్మూజ్ జల సంధిని తెరవాలని కొత్త డిమాండ్ పెట్టారు. 48 గంటలలోగా జల సంధి తెరవాలని తమతో ఒప్పందం చేసుకోవాలని కూడా ట్రంప్ కోరారు. ఆ విధంగా ఇరాన్ కి హెచ్చరించారు. కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకుంది. ఆ 48 గంటలలో తామేంటో చూపిస్తామని గట్టిగా చెబుతోంది. తాము ఇచ్చే సర్ప్రైజెస్ కి అమెరికా రెడీగా ఉండాలని కౌంటర్ వార్నింగ్ ఇవ్వడంతో రానున్న రెండు రోజులలో ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే సర్వత్రా ఉంది.

అగ్రరాజ్య హోదా :

ఇక ట్రంప్ కి అన్ని మార్గాలు మూసుకుని పోయాయా యుద్ధం విషయంలో తానే తగ్గాలా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే అగ్ర రాజ్యం హోదాకే ఎసరు వస్తుంది. ఎపుడైతే అమెరికా యుద్ధం ఆపేస్తుందో ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా సామాన్య దేశంగా అవుతుంది. ఇప్పటిదాకా అమెరికాను అంతా సూపర్ పవర్ అని అలా చూసేవారు ఇరాన్ యుద్ధంతో అది కాస్తా పోతే ఇక ఎలా అన్నదే అగ్ర రాజ్యం అసలైన వేదనగా ఉంది. ఇంకో వైపు చూస్తే అమెరికాలో కూడా ట్రంప్ ఇరాన్ తో చేస్తున్న యుద్ధం తీరు పట్ల వ్యతిరేకత మిన్నంటుతోంది. ఎవరూ సుముఖంగా లేరు, దాంతో దేశంలో అన్ని ధరలు పెరిగిపోయాయి, ఆర్ధిక వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో పడుతోంది. ఈ మొత్తం పరిణామాలు అయితే ట్రంప్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే పెట్రోల్ కొనుగోలు కి డాలర్ కాకుండా వేరే మారక ద్రవ్యం కనుక అమలులోకి వస్తే అమెరికా మొత్తానికి మొత్తం దెబ్బతినిపోతుంది అన్న వార్తలు కూడా అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News