ఒకటి ఒంటరి అంకెలా వైసీపీ !

రాజయం అంటే అందరినీ కలుపుకుని పోవడం. పొత్తులు అన్నవి కూడా వ్యూహంలో భాగం. వైసీపీ తీరు చూస్తే మొదటి నుంచి ఒంటరిగా పోటీకే ప్రాధాన్యత ఇచ్చింది.;

Update: 2026-04-06 03:52 GMT

రాజకీయం అంటే అందరినీ కలుపుకుని పోవడం. పొత్తులు అన్నవి కూడా వ్యూహంలో భాగం. వైసీపీ తీరు చూస్తే మొదటి నుంచి ఒంటరిగా పోటీకే ప్రాధాన్యత ఇచ్చింది. అది ఈ రోజుకీ కొనసాగుతోంది. సరే మొదటిసారి పోటీ చేసినపుడు ధీమా ఉండొచ్చు అనుకున్నారు కానీ 2019లో కూడా అదే విధానం అనుసరించింది. 2024 లో అవతల వైపు చూస్తే కూటమిగా అంతా జట్టు కట్టి వస్తే వైసీపీ ఒంటరిగా వచ్చి ఓటమిని మూటకట్టుకుంది. 2029 లో కూడా ఏపీలో సీన్ మారేలా లేదు, కూటమి కలసి వస్తే వైసీపీది సింగిల్ పోటీ. ఏపీలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుని పోయే ప్రయత్నం చేయడం లేదు. అది వైసీపీ విధానమా లేక ఆ పార్టీ ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడుతుందా అన్నది మరో చర్చ.

మరింతగా తేలిన వైనం :

ఇక తాజాగా చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి పార్లమెంట్ లో చర్చ జరిగింది దాదాపుగా యాభై పార్టీలు అన్నీ అమరావతి రాజధానికి అనుకూలంగా ఓటేశాయి. వైసీపీ మాత్రం వాకౌట్ చేసి ఒంటరిగా జాతీయ స్థాయిలో మిగిలింది. నిజానికి వైసీపీ లేవనెత్తిన పాయింట్లు అయితే ఓకే. రైతులకు న్యాయం చేయాలని కోరారు. అవినీతి మీద కూడా మాట్లాడారు, వాటిని సూచనలుగా ఇస్తూనే అమరావతి రాజధానికి చట్టబద్ధతకు తమకు అభ్యంతరం లేదని ఓటేస్తే ఎంతో మేలుగా ఉండేదన్న భావన అందరిలో ఉంది. కానీ అలాంటిది ఏమీ కాకుండా వైసీపీ అక్కడ వాకౌట్ తో సెల్ఫ్ గోల్ వేసుకుంది అని తాను ఒక్కటే వేరు అని చెప్పుకుంది అంటున్నారు.

ఒక్క మిత్రుడుగా అంటూ :

ఇక తెలుగు రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీకి బీఆర్ఎస్ కి మధ్య స్నేహ సంబంధ బాంధవ్యాలు ఉండేవి. దాంతో ఈ రెండు పార్టీలు ఒకే దారిలో సాగుతున్నాయని అంతా అనుకునేవారు, విమర్శలు అలాగే వచ్చేవి. ఎపుడైతే అమరావతి రాజధాని ఇష్యూ పార్లమెంట్ లో చర్చకు వచ్చిందో అపుడు బీఆర్ఎస్ కూడా తన ఓటు అటు వేసి వైసీపీకి పూర్తి దూరం పాటించింది అని అంటున్నారు. అంటే వైసీపీ తన వాదనా పటిమతో జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీని అయినా కదిలించలేకపోయిందా అన్న చర్చ వస్తోంది. అమరావతిలో అవినీతి అని రైతులకు న్యాయం జరగడం లేదని వైసీపీ చేస్తున్న వాదన తన వరకే పరిమితం చేసుకోవడం ద్వారా సన్న గొంతుగా చిన్న గొంతుగా మిగిలిపోయిందా అన్న చర్చ సాగుతోంది. కనీసం బీఆర్ ఎస్ ని అయినా ఈ విషయంలో కన్వీన్స్ చేయలేకపోయిందా లేక తన దారి ఒంటరి దారి అని మరోసారి చాటి చెప్పిందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఒంటరిగా ఉంటే :

రాజకీయాల్లో ఒకరి అవసరాలు మరొకరికి ఉంటాయి. ఇష్యూస్ మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కలుపుగోలుతనం ముఖ్యం. అందరితో కలసి ముందుకు సాగాల్సి ఉంటుంది అపుడు ఎక్కువ మేలు జరుగుతుంది. అంతే కాదు తమ ఆలోచనలను తమ వరకే పరిమితం చేసుకుంటే ఉపయోగం కూడా ఉండదు, వైసీపీ ఈ విషయంలో అయితే ఎందుకో సింగిల్ గా ఉంటూ సింగిల్ పాయింట్ అజెండానే నమ్ముకుంటోంది. వైసీపీ మొదటి నుంచి ఒంటరి బాటనే పయనిస్తోంది. చివరికి కొత్త మిత్రులను సంపాదించుకోవడం పక్కన పెడితే ఉన్న బీఆర్ఎస్ కూడా దూరం అయిందా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News