ఎన్టీఆర్‌ వద్దన్నారు - బాబు కావాలంటున్నాడు

Update: 2019-01-07 09:07 GMT
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో పార్టీల మధ్య వాదోపవాదాలు - ఆరోపణలు కూడా తారస్థాయికి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ ఎలా మోసం చేసిన విధానాన్నే టార్గెట్‌ చేస్తూ.. చంద్రబాబు దూసుకుపోతున్నారు. పనిలో పనిగా.. జగన్‌ బీజేపీ ఏజెంట్‌ అంటూ.. జగన్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌ గా ఉన్న బీజేపీ.. ఇప్పుడు అగ్రెసివ్‌ మోడ్‌ లోకి వచ్చేసింది. చంద్రబాబు కామెంట్స్‌ పై ఇప్పటివరకు జీవీఎల్‌ - కన్నా లాంటి నాయకులు మాట్లాడారు. ఇప్పుడు మోదీ రంగంలోకి దిగారు. డైరెక్ట్‌ గా చంద్రబాబునే టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు.

మొన్నటికి మొన్న లోకేష్‌ కోసం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు చంద్రబాబు వయా కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. రీసెంట్‌ గా కడప జిల్లా బీజేపీ నాయకులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించిన ప్రధాని.. చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అనేది లేకుండా చేయడానికి ఎన్టీఆర్ పార్టీ పెడితే..  అదే కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుండా ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడ్డారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం రాకుండా చేసేందుకు వివిధ పార్టీల నేతలతో మంతనాలు చేస్తున్న చంద్రబాబు.. రాష్ట్రంలో ఉన్న వెనుకపడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడితే అభిప్రాయపడ్డారు. ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చామని.. కానీ వాటికి సరైన లెక్కల చూపించమంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆరోపించారు. గుజరాత్‌ లో రైతులు - వ్యవసాయం - సాగునీరు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని.. అలాంటివి ఏపీలో ఏం కన్పించడం లేదని అన్నారు మోదీ. మొత్తానికి ఏపీలో మోదీ వర్సెస్‌ చంద్రబాబు మాటల యుద్ధం మొదలైందనే చెప్పాలి. మరి మోదీ విమర్శలపై చంద్రబాబు ఏ విధంగా రెస్పాండ్‌ అవుతారో చూడాలి.


Full View

Tags:    

Similar News