ఆ బూతులకు ఉరి శిక్ష కరెక్ట్ అన్న లోకేష్.

Update: 2022-02-23 14:30 GMT
బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా నేరమే. కానీ ఏపీలో మాత్రం విపక్ష నేతలు ఏదైనా తప్పు మాట్లాడితే పోలీసులు జిల్లాలు దాటి మరీ వచ్చి నోటీసులు ఇస్తున్నారు.

అరెస్టులు కూడా జోరుగా  చేస్తున్నారు. అదే అధికార పక్షం వైసీపీ వైపు మంత్రులు ఏమి  మాట్లాడినా, ఇతర నాయకులు నోరు దురుసుగా ప్రవర్తించినా నో యాక్షన్. ఎందుకిలా అంటున్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.

ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అసలు  అమలు కావడం లేదని, ఇది పక్కా  రాజారెడ్డి రాజ్యాంగం అని ఆయన ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నల్లజర్లలో ముఖ్యమంత్రి జగన్ మీద చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యల మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందచేసేందుకు రెడీ అయ్యారు.

ఈ సందర్భంగా నర్శీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజకీయం కూడా ఒక్కసారిగా వేడెక్కింది. దీని మీద నారా లోకేష్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయ్యన్న ఇంటికి పోలీసులు రావడం అక్కడ క్యాడర్ కూడా చేరుకోవడం ఇవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి.

ఈ సందర్భంగా లోకేష్ వేసిన ప్రశ్నలు అర్ధవంతంగానే ఉన్నాయని అంటున్నారు. లోకేష్ పాయింట్ టూ పాయింట్ అన్నట్లుగా మాట్లాడుతూ వైసీపీ సర్కార్ ని నిలదీశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బూతులు మాట్లాడితే ఎందుకు కేసులు నమోదు చేయరు అంటూ లా పాయింట్ ని బాగానే  లాగారు. ఏకంగా ఒక మంత్రి గారు పోలీసుల మీదనే నోరు చేస్తే ఏం కేసు పెట్టారు అని కూడా నిలదీశారు.

నిజానికి తెలుగుదేశం నేతలు వాస్తవాలు మాట్లాడుతున్నారని, అందులో బూతులు వెతికి మరీ కేసులు పెట్టడానికి పోలీసులు జిల్లాలు దాటుకుని వచ్చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరో వైపు వైసీపీ నేతలు హద్దులు మీరి మరీ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని, అయినా పోలీసులు వారిని పట్టించుకోకపోవడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని ఆయన సెటైర్లు వేశారు.

వాస్తవాలు మాట్లాడే టీడీపీ నేతల మీదనే కేసులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని ఇలా పోలీసులను పెట్టి మరీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. నిజానికి వైసీపీ నేతలు మాట్లాడిన బూతులకు కేసులు సరిపోవని, నేరుగా ఉరి శిక్ష విధించడమే కరెక్ట్ అని లోకేష్ అన్నారు.

పోలీసులకు వైసీపీ నేతల బూతులు వినసొంపుగా కమ్మగా ఉన్నాయా అని లోకేష్  గాలి తీసేశారు. మొత్తానికి చూస్తూంటే అయ్యన్నను అరెస్ట్ చేయాలని చూస్తున్న పోలీసులకు లోకేష్ ఘాటు కామెంట్స్ గుక్కతిప్పుకోనీయకుండా చేస్తున్నాయని అంటున్నారు.
Tags:    

Similar News