ఏపీ లో శ‌వ రాజ‌కీయం ఎవ‌రిది ?

Update: 2022-03-14 23:30 GMT
ఏపీలో శ‌వ రాజ‌కీయం ఎవ‌రిది అన్న‌ది ఓ ప్ర‌ధాన ప్ర‌శ్న. ఎందుకంటే అటు టీడీపీ ఇటు వైసీపీ ఇరు పార్టీలూ దీనిపైనే మాట్లాడుకుంటున్నాయి. స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా స‌భ‌లో ఉన్నా అవే అరుపులు అవే కేక‌ల‌తో త‌మ వాదం వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే జంగారెడ్డి గూడెం బాధిత కుటుంబాల‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. ఒక్కో కుటుంబానికి పార్టీ త‌ర‌ఫున త‌క్ష‌ణ సాయం కింద ల‌క్ష ప్ర‌క‌టించారు. నాటు సారా కార‌ణంగా చ‌నిపోయిన కుటుంబాల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ ద‌శ‌లో శ‌వ రాజ‌కీయాలు ఎవ‌రు చేస్తున్నారు అని ప్ర‌శ్నిస్తున్నారు యువ నాయ‌కులు లోకేశ్. తండ్రి శ‌వం అక్క‌డ ఉండ‌గా ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ఆ రోజు సంతకాలు సేక‌రించింది ఎవ‌రు అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.తాము చ‌ర్చిద్దాం అంటే మేం స్టేట్మెంట్ చ‌దువుతాం అని జంగారెడ్డి గూడెం ఘ‌ట‌న‌పై వైసీపీ ఏక ప‌క్షంగా అధికార ద‌ర్పంతో మాట్లాడ‌డం త‌గ‌ద‌ని అంటున్నారాయ‌న.

వాస్త‌వానికి గ‌త కొద్ది కాలంగా ఈ ఒక్క విష‌య‌మై రెండు పార్టీలూ బాహాబాహీకి దిగుతున్నాయి.ఆ రోజు వైఎస్సార్ మ‌ర‌ణించిన సంద‌ర్భం ద‌గ్గ‌ర నుంచి బాబాయ్ హ‌త్య వ‌ర‌కూ తాము  ఏనాడూ శ‌వ రాజ‌కీయాలు న‌డ‌ప‌నే లేద‌ని లోకేశ్ అంటున్నారు. యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్  నాయుడు అంటున్నారు.

త‌మ‌కు శ‌వ రాజ‌కీయాలు న‌డిపే శ్ర‌ద్ధ కానీ ఆ విష‌య‌మై ఆలోచించే ఓపిక కానీ లేవ‌నే అంటున్నాయి మిగ‌తా టీడీపీ వ‌ర్గాలు. దీనిపై వైసీపీ కౌంట‌ర్ ఏ విధంగా ఉండ‌నుంది. అస‌లు స‌మ‌స్యలు వ‌దిలి శ‌వ రాజ‌కీయాల చుట్టూ ఇరు పార్టీలూ మాట్లాడడం ఏంటి? అంటే ఇవాళే రాష్ట్రంలో నాటు సారా పుట్టుక ప్రారంభం అయిందా? లేదా మారుమూల శ్రీ‌కాకుళం స‌రిహ‌ద్దులో ప్ర‌వ‌హిస్తున్న నాటు సారా ను క‌ట్ట‌డి చేయ‌డం ఇవాళే ప్ర‌భుత్వాల‌కు చేత‌గాని ప‌నిగా మారిందా? లేదా సంబంధిత ఎస్ఈబీ వ‌ర్గాల‌కు స‌వాల్ గా ప‌రిణ‌మిస్తుందా?

టీడీపీ కానీ వైసీపీ కానీ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా మాట్లాడాలి. వీలున్నంత మేర బాధిత వ‌ర్గాల‌కు సాయం చేస్తూనే స‌మ‌స్య‌ను పరిష్క‌రించ‌గ‌ల‌గాలి.ఆ రోజు మ‌ద్య‌పాన నిషేధం అని ప్ర‌క‌టించింది ఎవ‌రు? జ‌గ‌న్ కాదా? ఆ రోజు రాష్ట్రంలో చీప్ లిక్క‌ర్ ఉండదు అని చెప్పింది ఎవ‌రు జ‌గ‌న్ కాదా ఇవి మ‌రిచి పోయి జ‌గ‌న్ మాట్లాడినా లేదా ఆయ‌న మ‌నుషులు మాట్లాడినా అవేవీ ఆమోద‌యోగ్యం కావు.

రాజకీయ నాయ‌కులు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా స‌రే ముందు శ‌వ రాజకీయాలు చేయ‌డం మానుకుంటే, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి నాటుసారా అమ్మ‌కాలు క‌ట్ట‌డి చేయ‌గ‌లిగి ఉంటే నిండు ప్రాణాలు బ‌లై ఉండేవా ?
Tags:    

Similar News