ఎంపీ సీట్లు పెరగబోతున్నాయ్...!

Update: 2023-05-29 08:00 GMT
ఎంపీ సీట్లు తొందరలో పెరగబోతున్నాయి. ఈ మాటను కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నూతన పార్లమెంట్ భవనలో లోక్ సభలో  888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చోవడానికి వీలుంది.

అంటే ఏకంగా ఒకేసారి 1,274 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా కొత్త పార్లమెంట్ ని తీర్చిదిద్దారు. దీంతో ఎంపీలు ఎంత ఎక్కువ అయినా ఏమీ ఫరవాలేదు. ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అన్నది 2026 నాటికి జరగనుంది.

దీంతో ప్రస్తుతం ఉన్న ఎంపీలు 543 కాస్తా మరో వంద నుంచి నూటాభై వరకూ పెరిగే చాన్స్ ఉంది. అలాగే దేశంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. దాంతో రాజ్య సభ సీట్లు కూడా పెరుగుతాయి. ఆ విధంగా ముందే ఆలోచించే మరో వందేళ్ళకు సరిపడా ఎంపీ సీట్లు రెడీ చేయించారు అని అంటున్నారు.

ఏపీలో ఇపుడు పాతిక మంది ఎంపీలు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన అంటే ఉత్తరాదిన ఎంపీలు మరింతమంది పెరుగుతారు. కుటుంబ నియంత్రణ సవ్యంగా పాటించిన సౌత్ ఇండియాలో చూస్తే అదే టైం లో ఎంపీలు తగ్గిపోతారని ఒక వాదన ఉంది.

దాంతో ఆ విధంగా కాకుండా వేరే కొలమానం తీసుకుని సౌత్ నుంచి ఎంపీల సీట్ల సంఖ్యను పెంచాలని సౌత్ ఇండియా నుంచి రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఏది ఏమైనా ఎంపీలు పెరుగుతారు. రేపటి రోజున కనీసంగా ఉభయ పార్లమెంట్ సభలలో ఎంపీలు వేయి మంది దాకా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో నూతన పార్లమెంట్ ఆ అవసరాలను తీరుస్తుంది అని అంటున్నారు. నూతన పార్లమెంట్ భవనం టెక్నాలజీతో కూడా అప్ డేట్ గా ఉందని ప్రధాని చెప్పుకొచ్చారు పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు చాలా ఇబ్బందులు పడేవారని ఆయన గుర్తు చేశారు.

ఇపుడు అందరి అవసరాలను తీర్చే విధంగా కొత్త పార్లమెంట్ ని తీర్చిదిద్దామని ఆయన వివరించారు. మొత్తానికి చూస్తే న్యూ పార్లమెంట్ ఓపెనింగ్ తో చాల మంది రాజకీయ జీవుల ఆశలను తీర్చే విధంగా ఎంపీ సీట్లు పెరుగుతాయని మోడీ అంటున్నారు. అయితే 2024లో మాత్రం  ఇదే నంబర్తో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

Similar News