సత్యసాయిబాబా వారసుడొచ్చాడు?

Update: 2015-11-23 10:34 GMT
కోట్లాది మంది భక్తులను హతాశులను చేసి 2011లో పరమపదించిన సత్యసాయిబాబాను ఇప్పటికీ భక్తులు మర్చిపోలేదు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎంతలా పూజించారో ఇప్పటికీ చాలామంది అలాగే పూజిస్తున్నారు. అసలు ఆయనకు మరణం లేదని.. మన మధ్యే ఉంటారని నమ్మే వీర భక్తులూ ఉన్నారు. అలాంటివారికి ఆనందం కలిగించేలా బెంగళూరు సమీపంలో ఓ వ్యక్తి తానే సత్యసాయిబాబానని... ఆయన అవతారం తానేనని ప్రచారం చేసుకుంటున్నాడు. మంగళవారం సత్యసాయి జయంతి ఉన్న నేపథ్యంలో ఆయన వ్యక్తి ప్రచారం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.       
బెంగళూరు సమీపంలోని ముద్దెనహళ్లి గ్రామానికి చెందిన మధుసూదననాయుడు తానే సత్యసాయిబాబానని చెబుతున్నాడు. సాయిబాబా 90వ జయంతి అయిన నవంబర్ 24న భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలని భక్తులు భావిస్తున్న తరుణంలో ఈ పునర్జన్మ విషయం వెలుగులోకి రావడం విశేషం. సత్యసాయి మరణించడానికి ముందు తన వారసుడిగా ఎవరినీ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ముద్దెనహళ్లికి చెందిన మధుసూదన్ నాయుడు మాత్రం.. తానే సాయి వారసుడినని చెబుతున్నాడు. సాయిబాబా రోజూ తనకు కలలోకి వస్తారని, తానేం చేయాలో అన్నీ ఆయనే చెబుతారని కూడా అంటున్నాడు.
    
జయంతి వేడుకలను ఘనంగా చేయాలని సత్యసాయి తనకు కలలో కనిపించి చెప్పారంటున్న నాయుడు మాటలను పుట్టపర్తిలోని సత్య సాయిబాబా ట్రస్టు సభ్యులు కొట్టిపారేస్తున్నారు.  సాయిబాబా పునర్జన్మ ఎత్తలేదని, మధుసూదన్ నాయుడు ఆయన వారసుడు కానేకాడని అంటున్నారు. పుట్టపర్తి ప్రాధాన్యాన్ని, పవిత్రతను మంటగలిపేందుకు కర్ణాటకలోని కొందరు కుట్రపన్నుతున్నారని వారు ఆరోపించారు. అందులో భాగంగానే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని అంటున్నారు. భారీగా ఆస్తులున్న ఈ ఆశ్రమాన్ని కబ్జా చేసేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నం చేస్తున్నారని... అందులోభాగంగానే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News