ఆ 2 రోజులు విశాఖ తీరం ‘డేంజర్ జోన్’
అవును.. రెండు రోజుల పాటు విశాఖ తీరం నుంచి 3240కి.మీ. దూరం వరకు డేంజర్ జోన్ గా నోటమ్ జారీ అయ్యింది.;
అవును.. రెండు రోజుల పాటు విశాఖ తీరం నుంచి 3240కి.మీ. దూరం వరకు డేంజర్ జోన్ గా నోటమ్ జారీ అయ్యింది. ఇంతకూ ఈ నోటమ్ అంటే ఏమిటి? రెండు రోజుల పాటు డేంజర్ జోన్ లో ఎందుకు ఉంచినట్లు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? లాంటి వివరాల్లోకి వెళితే.. బంగాళాఖాతంలో విశాఖ సముద్ర తీరం నుంచి హిందూమహాసముద్రం వరకు 3240కి.మీ. పరిధిని క్షిపణి పరీక్ష కోసం నో ఫ్లైయింగ్ జోన్ గా గుర్తించారు.
దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ ను జారీ చేసింది. డిసెంబరు 22 (సోమవారం) నుంచి డిసెంబరు 24 (బుధవారం) వరకు మిసైల్ టెస్టింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నోటమ్ జారీ చేశారు. ఇంతకూ ఈ నోటమ్ అంటే.. నోటీస్ టు ఎయిర్ మెన్ గా చెబుతారు. విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు.. ప్రమాదాల గురించి పైలెట్లు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు.. విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరికల ప్రకటనను నోటమ్ గా వ్యవహరిస్తారు.
ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంతవరకు ఈ పరిధిలో పౌర.. యుద్ధ విమానాలను దారి మళ్లిస్తారు. భారత కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 4.30 గంటల నుంచి డిసెంబరు 24 ఉదయం 8.30 గంటల మధ్యలో ఎప్పుడైనా ఈ మిసైల్ టెస్టింగ్ ఉంటుంది. ఏ సమయంలో దీన్ని ప్రయోగిస్తారన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. నిజానికి ఈ మిసైల్ పరీక్షను తొలుత డిసెంబరు 1 నుంచి డిసెంబరు 4 మధ్యలో నిర్వహించాలని భావించారు.
కానీ.. ఆ తర్వాత షెడ్యూల్ మారింది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. తొలుత 3485కి.మీ. దూరాన్ని డేంజర్ జోన్ గా పేర్కొంటే.. తాజాగా 3240 కి.మీ. మాత్రమే డేంజర్ జోన్ గా పేర్కొనటం. ఈ డేంజర్ జోన్ గా డిక్లేర్ చేసిన వేళ.. విమాన కార్యకలాపాలు.. సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు.. జలాంతర్గాములను అప్రమత్తంగా చేస్తారు. మరి.. తాజాగా నిర్వహించే మిసైల్ టెస్టింగ్ దేనికి సంబంధించిందన్న అంశంపై వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.