ఫ్రెండ్ తో ఒంటరిగా ఫ్లాట్ కు.. తండ్రి రావటంతో పెను విషాదం
రీల్ సీన్లు కొన్ని రియల్ గా అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అనూహ్య రీతిలో చోటు చేసుకునే ఈ ఉదంతాలు విషాదాలుగా మారుతుంటాయి.;
రీల్ సీన్లు కొన్ని రియల్ గా అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అనూహ్య రీతిలో చోటు చేసుకునే ఈ ఉదంతాలు విషాదాలుగా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అయ్యో అనిపించే ఈ విషాద ఉదంతం గురించి చదివినప్పుడు షాక్ కు గురి చేస్తుందని చెప్పక తప్పదు. స్నేహితుడితో ఒంటరిగా ఫ్లాట్ కు వెళ్లిన ఒక యువతి.. అనూహ్య రీతిలో అక్కడకు ఆమె తండ్రి రావటం.. తప్పించుకునే క్రమంలో 8 అంతస్తు నుంచి జారి పడి మరణించిన విషాద ఉదంతం చోటు చేసుకుంది.
ఈ షాకింగ్ ఇన్సిడెంట్ కు సంబంధించిన వివరాల్ని కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ వెల్లడించారు. పాతబస్తీకి చెందిన 20 ఏళ్ల యువతి సిటిలోని ఒక సంస్థలో పని చేస్తోంది. అక్కడే తనతో పని చేసే యువకునితో పరిచయం ఏర్పడింది. సదరు యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ఒక అపార్టుమెంట్ లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఉంది. తాజాగా యువతీ యువకులు ఇద్దరు ఫ్లాట్ కు వచ్చారు.
అక్కడ వారిద్దరు ఉన్న సమయంలో అనూహ్యంగా యువతి తండ్రి పని మీద ఆ ప్రాంతానికి వచ్చి.. ప్లాట్ చూసేందుకు అపార్టెమెంట్ కు వెళ్లారు. ఫ్లాట్ కు తాళం వేసి ఉన్నప్పటికీ.. అందులో నుంచి శబ్దాలు రావటంతో లోపల ఎవరో ఉన్నారని అనుమానించి.. పెద్ద ఎత్తున కేకలు వేయటం మొదలుపెట్టారు. దీంతో భయపడిన యువతి.. ఆమె స్నేహితుడు ఆ ఫ్లాట్ లో నుంచి పక్క ఫ్లాట్ లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎనిమిదో అంతస్తు బాలక్కనీ నుంచి కింద పడిన ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. దీంతో అక్కడి వారు షాక్ తినటమే కాదు..ఈ అనూహ్య పరిణామానికి విస్తుపోయిన పరిస్థితి.