ఈసారి లోకేశ్ వంతు.. పవన్ మాటను అట్లానే చెప్పేశాడుగా!
కొన్ని నిర్ణయాల్ని అనూహ్య రీతిలో తీసుకోవటంలో జనసేనాని పవన్ కల్యాణ్ ముందుంటారు.;
కొన్ని నిర్ణయాల్ని అనూహ్య రీతిలో తీసుకోవటంలో జనసేనాని పవన్ కల్యాణ్ ముందుంటారు. ఆయనలో రాజకీయ పరిణితి తక్కువన్నట్లుగా కొందరు విమర్శలు చేయటం.. తక్కువ చేసి మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. అయితే.. పవన్ మాత్రం తాను చేసే ప్రతి పనిని క్లియర్ గా .. క్లారిటీతో చేస్తుంటారన్నది ఆయన తీరును నిశితంగా పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. 2019 ఎన్నిలకు ముందు టీడీపీతో పొత్తు ఉంటుందని తేల్చేయటమే కాదు.. అసలుసిసలు రాజకీయ మిత్రుడిగా చంద్రబాబుకు అండగా నిలిచిన వైనం తెలిసిందే.
కష్టకాలంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాలు పొందే దిశగా ఆలోచించే సగటు రాజకీయ పార్టీలకు భిన్నంగా.. అసలుసిసలైన మిత్రుడిగా వ్యవహరించిన పవన్.. పొత్తు ప్రయాణంలో ఎదురయ్యే చికాకుల్ని చాలా హుందాగా అధిగమిస్తున్నట్లుగా చెప్పాలి. అదే సమయంలో.. పవన్ నొప్పించకుండా ఉండేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. అప్రమత్తంగా ఉంటున్నారు. రానున్న పదిహేనేళ్లు టీడీపీతో కలిసి పొత్తు ప్రయాణం సాగుతుందని జనసేనాని చెప్పే మాటలకు కొనసాగింపు మాటలు పెద్దగా కనిపించని పరిస్థితి.
దీనికి కొందరు జనసేన అభిమానులు అసంత్రప్తి వ్యక్తం చేయటం కనిపిస్తుంది. అయితే.. అలాంటివేమీ పట్టించుకోకుండా ఏపీ భవిష్యత్తు.. ఏపీ ప్రయోజనాలు మాత్రమే తనకు ముఖ్యమని స్పష్టం చేసే పవన్ పొత్తు మాటలకు తాజాగా లోకేశ్ అంతే సానుకూలంగా స్పందించటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. రాజమహేంద్రవరంలో తాజాగా జరిగిన టీడీపీ సమావేశంలో పాల్గొన్న నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
వచ్చే పదిహేనేళ్లు కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని లోకేశ్ చెప్పిన మాటల్ని చూస్తే.. పవన్ ట్రాక్ లోకి టీడీపీ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ఇంతకాలం తమ అధినేత మాత్రమే కూటమి ఫ్యూచర్ జర్నీ గురించి మాట్లాడుతున్నాడు.. టీడీపీ నుంచి ఎలాంటి స్పందనా లేదన్న బాధ.. లోకేశ్ తాజా వ్యాఖ్యతో తీరినట్లుగా చెప్పాలి. పొత్తు బంధం గురించి.. కూటమి కలిసి ప్రయాణించే అంశానికి సంబంధించి లోకేశ్ నుంచి ఇప్పటివరకు మాట్లాడిన మాటలకు కాస్త భిన్నంగా.. స్పష్టంగా.. సూటిగా.. పవన్ లైన్ లో మాట్లాడినట్లుగా చెప్పాలి.
కలిసి పని చేస్తాం.. పవన్ తో మంచి సమన్వయం ఉంది.. కూటమి బలంగా ఉందన్న జనరల్ మాటలకు భిన్నంగా రాజహేంద్రవరంలో మాత్రం కూటమి 15 ఏళ్లు కలిసి ప్రయాణిస్తుందని చెప్పటం ద్వారా జనసైనికుల్లో ఉన్న సందేహాల్ని.. అసహనాన్ని లోకేశ్ తన మాటతో తీర్చేశారని చెబుతున్నారు. ఇంతకాలం పవన్ మాటలు వన్ సైడ్ అన్నట్లు కాకుండా తాము కూడా అలాంటి భావనలో ఉన్నమాన్న విషయాన్ని లోకేశ్ చెప్పినట్లైంది.
నిజానికి ఈ తరహా మాట చంద్రబాబు నోటి నుంచి కంటే లోకేశ్ నోటి నుంచే మరింత బలంగా రావాలని కోరుకుంటున్న పరిస్థితి. అందుకు తగ్గట్లే లోకేశ్ తాజాగా పదిహేనేళ్ల ప్రయాణం గురించి మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఇంతకాలం పదిహేనేళ్ల బాండ్ మీద మౌనంగా ఉన్న టీడీపీ..తన మౌనాన్ని వీడి.. రాజమహేంద్రవరం వేదికగా పొత్తు బంధం గురించి మాట్లాడటం చూస్తే.. కాపు యువత ప్రభావం ఎక్కువగా ఉండి.. జనసేన సానుభూతిపనులు భారీగా ఉండే చోట చెప్పటం ద్వారా లోకేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచే పొత్తు బంధం గురించి మాటలు రావాల్సి ఉంది.