డుంకి ట్రావెల్ ఏజెంట్ ఇంట్లో 313 కేజీల వెండి.. రూ.5కోట్ల నోట్లు

భారతీయుల్ని అమెరికాకు దొంగచాటుగా తరలించే ట్రావెల్ ఏజెంట్లు బోలెడంతమంది ఉంటారు.వీరిలో డుంకీ మార్గంలో అమెరికాకు చేరవేసే వాళ్లు ఉంటారు.;

Update: 2025-12-20 05:54 GMT

భారతీయుల్ని అమెరికాకు దొంగచాటుగా తరలించే ట్రావెల్ ఏజెంట్లు బోలెడంతమంది ఉంటారు.వీరిలో డుంకీ మార్గంలో అమెరికాకు చేరవేసే వాళ్లు ఉంటారు. అమెరికాలోకి దొంగచాటుగా ప్రవేశించే వారి కోసం వలసదారులు సుదీర్ఘమైన.. కష్టసాధ్యమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం డుంకి మార్గాన్ని ఎంచుకుంటారు. దీనికి సంబంధించి కొందరు ఏజెంట్లు ఉంటారు. అలాంటి ఏజెంట్ ఒకరికి సంబంధించిన ఆస్తులపై ఈడీ తాజాగా దాడులు చేసింది.

ఈ సందర్భంగా వారికి కళ్లు బైర్లు కమ్మే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈడీ టీంలు ఢిల్లీ.. పంజాబ్.. హర్యానాలోని డజన్ కు పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి 313 కేజీల వెండి.. ఆరు కేజీల బంగారంతో పాటు రూ.4.62 కోట్ల నోట్ల కట్టలు లభించాయి. ఈ భారీ సొమ్మును చూసిన ఈడీ అధికారులు సైతం అవాక్కైనట్లుగా తెలుస్తోంది. 313 కేజల వెండి విలువ రూ.19.13 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజాగా జరిపిన సోదాల్లో ఈ ఏజెంట్ల ఇళ్లల్లో స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషిస్తున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ ఫోన్లలో అభ్యంతరకర చాటింగ్ కనిపించినట్లుగా తెలుస్తోంది. డుంకి మార్గంలో పంపే అంశాలకు సంబంధించిన కొన్ని రికార్డులు కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. అమెరికాకు అక్రమ మార్గంలో పంపే ఈ ఏజెంట్.. సదరు వ్యక్తులకు చెందిన ఆస్తి పత్రాల్ని తన కమిషన్ లో భాగంగా పూచీకత్తుగా ఉంచుకుంటాడని అంచనా వేస్తున్నారు. డుంకి ఏజెంట్ ఒకరి వద్దే ఈ స్థాయిలో ఆస్తులు ఉంటే.. మిగిలిన వారి సంగతేంటి? అన్నదిప్పుడు ప్రశ్న.

Tags:    

Similar News