ఏపీలో కొత్త వివాదం....!

Update: 2020-07-16 01:30 GMT
ఏపీలో ప‌రిస్థితులు ఊహించ‌ని విధంగా మారుతున్నాయి. ఓ వైపు క‌రోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండ‌టం, మ‌రోవైపు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు సైతం హీటెక్కిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తేనెతుట్ట‌ను క‌దిలించారు. గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటును తెర‌మీద‌కు తెచ్చారు. జిల్లా పునర్‌వ్యవస్థీకరణపై కమిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సార‌థ్యంలోని కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేయనుంది.

ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం సహా వివిధ అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది. చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అవుతుండ‌గా సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉండ‌నున్నారు. వీలైనంత త్వరలో కమిటీ నివేదిక ఇవ్వాలని కేబినెట్‌ ఆదేశించింది. మానవవనరులను వీలైనంత సమర్థవంతగా వినియోగించుకోవడం, మౌళిక సదుపాయాలను వినియోగించుకోవడం ఉద్దేశం ఈ కొత్త జిల్లాల‌పై ప్ర‌ధాన ఫోక‌స్. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఈ పునర్‌వ్యవస్థీకరణ అవసరమని మంత్రివర్గం భావించింది. జిల్లాలు పెద్దవిగా ఉండడంతో పాటు, జనాభా కూడా అధికంగా ఉండడం కూడా కారణంగా పేర్కొన్న మంత్రివర్గం పాలనా సౌలభ్యంతోపాటు, ప్రజలకు వీలైనంత చేరువగా ఉండేందుకు దోహదపడుతుందని విశ్లేషించింది.

అయితే, ఏపీ ముఖ్య‌మంత్రి ఇలా కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్స్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం ఏపీలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. మ‌దనపల్లె పట్టణంలోని చారిత్రక ప్రదేశాల సందర్శన - మదనపల్లె జిల్లా ఆకాంక్షల ప్రదర్శన పేరుతో మదనపల్లె జిల్లా సాధన సమితి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. స్థానిక మిషన్ కాంపౌండ్ నందలి డాక్టర్ జాకబ్ ఛాంబర్లీన్ స్మారక స్థలం వద్ద క్రైస్తవ సంఘాల ప్రముఖులు సమావేశమై మ‌దనపల్లె చారిత్రక విశిష్టతను గుర్తించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని క్రైస్తవ సంఘాల తరపున కోరుతున్నామన్నారు. మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ, మదనపల్లె జిల్లా ఆకాంక్షల ప్రదర్శన నిర్వహించారు. సమావేశానికి ముందు మదనపల్లె జిల్లా ఆవిర్బవించాలని కోరుతూ పాస్టర్లు జీసస్ ముందు ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మందిరాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News