ఆయన పోతారన్నారు.. ఈయనే పోయారు

Update: 2018-12-11 16:27 GMT
లగడపాటి రాజగోపాల్.. ఎన్నికల సర్వేలలో తానే పుడింగ్‌ నని చెప్పుకుంటారు. తన సర్వేలకు ఉత్తరాది వారు చేసే సర్వేలకు పొంతన లేదని - వారికి స్దానిక పరిస్దితులు తెలియవని లగడపాటి రాజగోపాల్ అభిప్రాయం... కాదు.. కాదు.. అత్యంత అతి విశ్వాసం. అదే ఇప్పుడు లగడపాటి కొంప ముంచిందంటున్నారు. తెలంగాణలో మహాకూటమి 65 స్దానాలతో అధికారంలోకి వస్తుందని చెప్పిన లగడపాటి సర్వే ఫలితాల ముందు బొక్కబోర్ల పడింది. తెలంగాణ రాష్ట్ర సమితికి 30 నుంచి 45 సీట్లు వస్తాయన్న లగడపాటి సర్వే అభాసుపాలయ్యింది. ఈ సర్వేకు వ్యతిరేకంగా ఏకంగా 90 స్దానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది.

మహాకూటమి తెలంగాణ ఎన్నికలలో ఊసులోకి లేకుండా పోయింది. ఇది లగడపాటి రాజగోపాల్ సర్వేపై ఇన్నాళ్లు ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేసిన నియోజకవర్గంలో ఆయనే ఓడిపోతారంటూ లగడపాటి నర్మగర్భంగా ప్రకటించారు. ఇందుకు తనకు తారసపడిన పోలిసు కానిస్టేబుళ్ల అభిప్రాయాలను తోడుగా తెచ్చుకున్నారు. తనను గజ్వేల్ పర్యటనకు వెళ్లినప్పుడు మార్గమధ్యంలో పోలిసులు తన వాహానాన్ని ఆపారని తనను గుర్తు పట్టిన కొందరు కానిస్టేబుళ్లు "ఆయనే పోతారు" అని కేసీఆర్‌ ను ఉద్దేశించి చెప్పారని లగడపాటి ప్రకటించారు. లగడపాటి ద్రుష్టిలో ఆయనే అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షడు కె. చంద్రశేఖర రావే అని అందరూ భావించారు. తీరా ఫలితాలు వెలువడిన తర్వాత అసలు విషయం వెల్లడయ్యింది. ఆయనే ఓడిపోతారు అంటే అర్దం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాదని తేలిపోయింది. ఇందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడగానే లగడపాటి రాజగోపాల్ ఊసులో లేకుండా పోయారు. ఇంతటి మహాసర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఫలితాలు వెలువడగానే పత్తలేకుండా పోయారు. ఆయన సర్వే కూడా ఊసులో లేకుండా పోయింది.

Tags:    

Similar News